ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలి
జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లాలోని ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా న్యాయబద్ధంగా ఎన్నికలు జరిగేలా అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు.
దిశ, సంగారెడ్డి : జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లాలోని ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా న్యాయబద్ధంగా ఎన్నికలు జరిగేలా అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎన్నికల వ్యయ నియంత్రణ, ఎంన్ఫోర్స్మెంట్ కమిటీ, గ్రీవెన్స్ కమిటీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ చెన్నూరి రూపేష్‌లు మాట్లాడుతూ…. ఎన్నికల సందర్భంగా డబ్బు, మద్యం, ప్రలోభాలు, జప్తుల పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో డబ్బు, మద్యం, ప్రలోభాలను నియంత్రించడానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీలలో పట్టుబడిన నగదుకు రసీదు అందించి జిల్లా గ్రీవెన్స్ కమిటీకి అందజేయాలన్నారు. చెక్ పోస్టుల్లో అన్ని రకాల వాహనాల తనిఖీలు చేయాలని, తనిఖీల సందర్భంలో నియమ నిబంధనలు పాటించాలన్నారు. బోర్డర్ చెక్పోస్టుల్లో తనిఖీలు పకడ్బందీగా చేపట్టాలని, సీసీ కెమెరాల పర్యవేక్షణ 24 గంటలు ఉండాలని, అభ్యర్థులు సువిధ యాప్‌లో అన్ని అనుమతులు పొందవచ్చని తెలిపారు. ఎన్నికల్లో రాజకీయ నాయకుల ఖర్చు రూ. 90 లక్షలకు మించరాదన్నారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు నిర్వహించే రోడ్ షోలు ఫంక్షన్లలో భోజనాలు ఖర్చులను ఎఫ్‌ఎస్‌టి టీములు రికార్డు చేయాలన్నారు. రాత్రి 10 గంటల తర్వాత లౌడ్ స్పీకర్ ప్రచారాలు నిలిపివేయాలని ఆదేశించారు.
నేషనల్ హైవే 65 పై చెకింగ్ పాయింట్స్ వద్ద ప్రాపర్‌గా అన్ని వాహనాలను చెక్ చేయాలని అధికారులను ఆదేశించారు. సీ విజిల్ యాప్ 1950 గురించి ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. సివిజిల్ యాప్‌లో వచ్చే ఫిర్యాదులపై 100 నిమిషాల్లో పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌లు చంద్రశేఖర్, మాధురి, డీఆర్ఓ పద్మజారాణి, జడ్పీ సీఈఓ జానకి రెడ్డి, డీఎఫ్ఓ శ్రీధర్, ఎల్ డీఏం గోపాల్, ఏఆర్ఓలు, ఆర్‌టీఓ అధికారులు, ఎక్సైజ్ అధికారులు, అటవీశాఖ అధికారులు, ఎన్నికల సంబంధిత అధికారులు పాల్గొన్నారు.