హైడెన్సిటీ పత్తి సాగు సరే.. ఆర్థిక ప్రోత్సాహమేదీ..?

వాణిజ్య పంటల సాగును ప్రోత్సాహించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వానకాలం సీజన్ లో.... Special Story on Cotton Crop

Update: 2023-03-26 02:21 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి: వాణిజ్య పంటల సాగును ప్రోత్సాహించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వానకాలం సీజన్ లో అధిక సాంద్రత (హైడెన్సిటీ) పత్తి సాగు చేయాలని రైతులకు దిశానిర్దేశం చేశారు. హైడెన్సిటీ పద్ధతిలో పత్తి సాగు చేస్తే అధిక దిగుబడితో పాటుగా ఎకరాకు రూ. 4 వేల ప్రోత్సాహకం అందిస్తామని అధికారులు విస్తృతంగా ప్రచారం చేశారు. దిగుబడి, లాభాల మాట అటుంచితే.. పంట కాలం పూర్తయి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి రైతులకు రావల్సిన ఆర్ధిక ప్రోత్సహకాలు అందకపోవడంతో అన్నదాతలు అవేదన చెందుతున్నారు. ప్రత్యామ్నాయ పంట సాగువైపు రైతులను మళ్లీంచాలన్న లక్ష్యంతో పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలోని వర్గల్, చేర్యాల, మిరుదొడ్డి, మద్దూరు, చిన్నకోడూరు, సిద్దిపేట రూరల్, తొగుట, అక్కన్నపేట, బెజ్జంకి, జగదేవపూర్, రాయపోల్, నంగునూరు, దుబ్బాక, కొహెడ, గజ్వేల్, హుస్నాబాద్, మర్కూక్ మండల్లో హైడెన్సిటీ విధానంలో రైతులతో పత్తి సాగు చేయించారు.

645 మంది రైతుల ఎదురుచూపులు ...

జిల్లా పరిధిలోని 17 మండల పరిధిలో 645 మంది రైతులు 1030 ఎకరాల్లో అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎకరాకు రూ. 4వేల చొప్పున జిల్లాలోని 645 మంది రైతులకు రూ.41,19,925 రావాల్సి ఉంది. ఇదిలా ఉంచితే పత్తి పంట పూర్తి అయి 5 నుంచి 6 నెలలు గడిచినా ఆర్థిక ప్రోత్సాహకం మాత్రం అందకపోవడంతో రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. హైడెన్సిటీ ప్రతి సాగుతో పంట సాగు ఖర్చులు తడిసి మోపడయ్యాయని, దిగుబడి మాత్రం అంతంత మాత్రంగా ఉండటంతో పెట్టుబడి రాలేదని రైతులు వాపోతున్నారు. ఆర్థిక ప్రోత్సాహకాల కోసం వ్యవసాయ అధికారులను అడిగితే వస్తాయని చెబుతున్నారని, ఇప్పటికైనా డబ్బులను ఖాతాల్లో జమ చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.

వెంటనే ఖాతాల్లో జమచేయాలి: తిరుపతి రెడ్డి, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు

హైడెన్సిటీ పత్తి సాగు చేసిన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం వెంటనే ఆర్థిక ప్రోత్సాహకం డబ్బులను జమ చేయాలి. ప్రభుత్వ సూచన మేరకు సాగు చేస్తే పెట్టుబడి పెరిగి, దిగుబడి సైతం అంతంత మాత్రంగా వచ్చి రైతులు నష్టపోయారు. దీనికి తోడు ప్రభుత్వం ప్రోత్సాహం అందించక పోవడం దారుణం.

Tags:    

Similar News