రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి

రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు.

Update: 2024-08-22 12:32 GMT

దిశ, కొల్చారం : రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం కొల్చారం పోలీస్ స్టేషన్ ను ఏఎస్పీ ప్రసన్నకుమార్, మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డితో కలిసి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్లో గత మూడు సంవత్సరాల రికార్డులను పరిశీలించారు. కొల్చారం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులు, వాటి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కేసులు త్వరితగతంగా పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెదక్, హైదరాబాద్ జాతీయ రహదారి మండలం మీదుగా పోతున్నందువల్ల కొల్చారం మండలంలో తరచూ లోతువాగు నుండి కిష్టాపూర్ వరకు ప్రమాదాలు జరుగుతున్నాయని,

    ప్రమాదాల నివారణ కోసం రేడియం స్టిక్కర్లు, స్పీడ్ బ్రేకర్లు, వార్నింగ్ లైట్లు ఏర్పాటు కోసం కలెక్టర్ తో మాట్లాడినట్లు, త్వరలో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. గత సంవత్సరం 23 మంది కొల్చారం మండలంలో మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదాలలో మృతి చెందారని ఎస్పీ తెలిపారు. ప్రజల ప్రాణాలు కాపాడడానికి అవసరమైన రోడ్డు భద్రతా చర్యలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఏడుపాయలకు వచ్చి భక్తులు మంజీరా నది పాయలు , గణపురం ఆనకట్ట వద్ద నీటిలో మునిగి మృతి చెందుతున్నారని ఏడుపాయలలో

    తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటి నివారణ కోసం చర్యలు తీసుకోవాలని ఎండోమెంట్, ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఎక్కడబడితే అక్కడ నదిలోకి వెళ్లే వీలు లేకుండా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిర్వహణ బాధ్యత ఆయా గ్రామ పంచాయతీలది అని, సీసీ కెమెరాల మరమ్మతులు గ్రామపంచాయతీ ద్వారా వెంటనే చేపట్టేలా స్థానిక ఎస్సై చొరవ చూపాలని ఈ సందర్భంగా సూచించారు. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టాలని, దీంతో పాటు మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.  

Tags:    

Similar News