ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం : అభ్యర్థి సతీష్ కుమార్

ఎన్నికల్లో తన పై నమ్మకంతో, విశ్వాసంతో ఓటు వేసిన ప్రజలకు, అలాగే తనకోసం ఎన్నికల్లో పనిచేసిన కష్టపడిన కార్యకర్తలకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు రుణపడి ఉంటానని హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి వొడితల సతీష్ కుమార్ అన్నారు.

Update: 2023-12-03 12:38 GMT

దిశ, హుస్నాబాద్ : ఎన్నికల్లో తన పై నమ్మకంతో, విశ్వాసంతో ఓటు వేసిన ప్రజలకు, అలాగే తనకోసం ఎన్నికల్లో పనిచేసిన కష్టపడిన కార్యకర్తలకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు రుణపడి ఉంటానని హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి వొడితల సతీష్ కుమార్ అన్నారు. ఆదివారం ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత విలేకరులతో మాట్లాడారు. ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని తెలిపారు. గడిచిన పదేళ్లలో హుస్నాబాద్ శాసనసభ్యునిగా తనను ప్రజలు ఎంతో ఆదరించారని గుర్తుచేసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంత్రుల సహకారంతో ఎన్నోఅభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని తెలిపారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని కార్యకర్తలు ఎవరు నిరాశ చెందవద్దని, అధైర్య పడవద్దని కోరారు.

తనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు శ్రేణులు ఇకముందు కూడా ప్రజాక్షేత్రంలో ప్రతిపక్షంగా ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోరాడుతామని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. తనకోసం కార్యకర్తలు క్షేత్రస్థాయిలో శక్తివంచన లేకుండా కృషి చేశారని వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు తెలిపారు. క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేణులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని సతీష్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకున్నట్టు ఎన్నికల ఫలితాలను చూస్తే అర్థం అవుతుందని అన్నారు. తనకు సహకరించిన హుస్నాబాద్ ప్రజలకు అధికారులకు ప్రభుత్వ సిబ్బందికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలను కూడా కార్యకర్తలతో త్వరలో సమీక్షిస్తామని తెలిపారు.

పొన్నం ప్రభాకర్ కు అభినందనలు తెలిపిన సతీష్ కుమార్

అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ స్థానం నుండి పోటీ చేసి గెలుపొందిన తన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ కు బీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్ అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు, అలాగే హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని, స్థానికంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను రాబోయే ఐదేళ్లలో నిలబెట్టుకోవాలని ఆకాంక్షించారు.

Tags:    

Similar News