ఏసీబీ వలలో సంగారెడ్డి డీఈవో రాజేష్
ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం నుంచి రూ.50వేలు లంచం తీసుకుంటూ డీఏవో (జిల్లా విద్యాధికారి) ఏసీబీకి రెడ్ హ్యండెడ్ గా పట్టుబడిన ఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది.
స్కూల్ అప్ గ్రేడ్ కోసం రూ.1.10లక్షల లంచం డిమాండ్
దిశ, సంగారెడ్డి: పాఠశాల అప్ గ్రేడ్ కోసం ధరఖాస్తు చేసుకున్న ప్రైవేట్ పాఠశాలకు ఎన్ఓసీ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి నాంపల్లి రాజేష్, సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రామచంద్రాపురం పరిధిలోని ఓ ప్రైవేట్ పాఠశాల ఎస్సెస్సీ సిలబస్ నుంచి ఐసీఎస్ఆర్ నేషనల్ సిలబస్ కు మార్చుకునేందుకు ఎన్ఓసీ ఇవ్వాలని సంగారెడ్డిలోని డీఈవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు.
సంబంధిత ఎంఈవో సైతం అప్ గ్రేడ్ కు అవకాశం ఇవ్వాలని అన్ని అర్హతలు ఉన్నట్లు ధృవీకరించారు. కార్యాలయంలో డీఈవో నాంపల్లి రాజేష్ ను కలిసి పాఠశాల అప్ గ్రేడేషన్ కు ధరఖాస్తు చేసుకున్నాం ఎన్ఓసీ ఇవ్వాలని కోరారు. దీంతో సీనియర్ అసిస్టెంట్ గా డీఈవో కార్యాలయంలోనే పని చేస్తున్న రామకృష్ణ, డీఈవో రాజేష్ లు ఎన్ఓసీ కావాలంటే రూ.1.10లక్షల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకేసారి అంత మొత్తంలో ఇవ్వలేం రెండు విడతల్లో ఇస్తామని అంగీకారానికి వచ్చారు.
అన్ని అర్హతలు ఉన్నా సదరు పాఠశాల యాజమాన్యం లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. దీంతో శుక్రవారం జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయానికి పాఠశాల యాజమాన్యం మొదటి విడతకు సంబంధించి రూ.50 వేలు ఇచ్చేందుకు రాగా అసిస్టెంట్ రామకృష్ణ రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.
15నే ఫిర్యాదు అందింది: ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్
పాఠశాల యాజమాన్యం నుంచి ఎస్ఎస్సీ సిలబస్ నుంచి ఐసీఎస్ఆర్ నేలషనల్ సిలబస్ కు అప్ గ్రేడ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ డీఈవో రాజేష్, అసిస్టెంట్ రామకృష్ణ లను సంప్రదించగా రూ.1.10లక్షల లంచం అడిగినట్లు పాఠశాల యాజమాన్యం 15న ఫిర్యాదు చేసింది. అన్ని అర్హతలు ఉన్నా లంచం ఇవ్వడం ఇష్టం లేని యాజమాన్యం తమకు ఫిర్యాదు చేసింది. రూ.1.10లక్షల ఇవ్వాలని డిమాండ్ చేయగా రెండు విడతల్లో ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది.
దీంతో శుక్రవారం మొదటి విడత లంచం ఇచ్చేందుకు రాగా డీఈవో కార్యాలయంలో పాఠశాల యాజమాన్యం నుంచి రామకృష్ణ రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం. పూర్తిగా విచారణ చేపట్టి వారిద్దరిని కోర్టులో హజరుపరుస్తాం. ఈ సోదాల్లో పాల్గొన్న వారిలో ఏసీబీ అధికారులు ఇన్స్పెక్టర్ వెంకట్ రాజు, నాగేష్, శ్రీనివాస్, రమేష్, తదితరలు ఉన్నారు.