కుళ్లిన కోడిగుడ్లు..కాలం చెల్లిన పాల ప్యాకెట్లు..ఆరోపణలున్నా మళ్లీ వారికే కాంట్రాక్ట్..
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలనే
దిశ, నారాయణఖేడ్ : గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు అంగన్వాడీ సెంటర్లకు నిత్యావసరకులను పంపిణీ చేస్తోంది. ఈ నిత్యావసర సరుకులు అందజేసేందుకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు చేతివాటం చూపిస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నారాయణఖేడ్ డివిజన్ లో అంగన్ వాడీ కేంద్రాలకు కుళ్లిన కోడిగుడ్లు, కాలం చెల్లిన పాల ప్యాకెట్లను కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్నారు. వీటిని తినలేక, తాగలేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. నాసిరకం వస్తువులు సరఫరా చేస్తు, అంగన్వాడీ టీచర్లు చెప్పినప్పటికీ విపిపించుకోకుండా వ్యవహరిస్తున్నారు. అధికారుల అండదండలతోనే కాంట్రాక్టర్లు ఇష్టారీతినా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. 17 ఏండ్లుగా వారే ఏక చాత్రాధిపత్యంతో కొత్తవారికి ఛాన్స్ ఇవ్వకుండా టెండర్‌ను దక్కించుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారు. కుళ్లిన గుడ్లు వస్తున్నాయని ఫిర్యాదులు అందించినా పట్టించుకోవడం లేదని పలు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఐదేళ్లుగా ఇన్చార్జి పర్యవేక్షణలోనే..
సంగారెడ్డి జిల్లాలో 1504 అంగన్ వాడీ కేంద్రాలు ఉండగా నారాయణఖేడ్ ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి ఐదేళ్ల నుంచి ఇన్చార్జి గానే కొనసాగుతున్నారు. నారాయణఖేడ్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో నారాయణఖేడ్, మనూర్, నాగల్ గిద్ద, సిర్గాపూర్, నిజాంపేట్, కంగ్టీ, కల్లేరు మండలాల్లో మొత్తం 404 అంగన్ వాడీ కేంద్రాలు ఉండగా, అంగన్ వాడీ కేంద్రాలు 282, మినీ అంగన్ వాడీ కేంద్రాలు 122 ఉన్నాయి. ఆరోగ్య లక్ష్మి పథకం కింద 1,05,360 గుడ్లు పంపిణీ చేస్తున్నారు. అంగన్ వాడీ కేంద్రాల్లో ఆరోగ్య లక్ష్మి పథకం ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల 9737 చిన్నపిల్లలు ఉన్నారు. గర్భిణులు 2147 మంది ఉండగా, బాలింతలు 2305 ఉన్నారు. గర్భిణులు , బాలింతలకు ఒక పూట సంపూర్ణ భోజనం రోజుకు ఉడకబెట్టిన గుడ్లు చొప్పున నెలకు 30 గుడ్లు ఇస్తున్నారు. అంగన్ వాడీ కేంద్రాల్లో పని దినాల్లో ప్రతి గర్భిణికి 150 గ్రాముల బియ్యం, 30 గ్రాముల కందిపప్పు, 16 గ్రాముల నూనె ఇస్తున్నారు. ఏడు నెలల నుంచి 3 ఏళ్ల లోపు పిల్లలు రోజుకు ఒక గుడ్డు చొప్పున 16 గుడ్లు, బాలామృతం కేటాయిస్తున్నారు. మూడున్నరేళ్ల నుంచి 6 ఏళ్ల పిల్లలకు రోజుకు ఉడకబెట్టిన ఒక గుడ్డు చొప్పున 30 గుడ్లు ఇస్తున్నారు. అంగన్ వాడీ కేంద్రం పని దినాల్లో 75 గ్రాముల బియ్యం, 15 గ్రాముల కందిపప్పు, ఐదు గ్రాముల నూనె అందిస్తున్నారు.
కాగా ఈ కేంద్రాలకు సరుకులైన పాలు, గుడ్లు, బియ్యం, పప్పులు, నూనె, కారం, పసుపు, బాలామృతం, తదితర నిత్యావసర వస్తువులు అంగన్ వాడీ కేంద్రాల్లో చిన్నపిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు, కిషోర్ బాలికలకు పౌష్టికాహారం అందించాల్సి ఉంది. అక్టోబర్ నెలలో నారాయణఖేడ్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్ వాడీ కేంద్రాలకు కుళ్లిన కోడిగుడ్డు, కాలం చెల్లిన పాల ప్యాకెట్లు కాంట్రాక్టర్లు సరఫరా చేశాడు. కుళ్ళిన కోడిగుడ్లు, కాలం చెల్లిన పాల ప్యాకెట్లు తీసుకోవడానికి అంగన్ వాడీ టీచర్స్ నిరాకరించిన ప్పటికీ వస్తువులు సరఫరా చేసే కాంట్రాక్టర్లు బెదిరింపులకు గురిచేస్తూ.. బలవంతంగా అవసరముంటే తీసుకోండి లేకుంటే లేదు అనే విధంగా అంగన్ వాడీ టీచర్లతో మాట్లాడుతున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. కాగా కొన్ని అంగన్ వాడీ కేంద్రాలకు వస్తువులు సరఫరా చేయకుండానే సరఫరా జరిగినట్లు రికార్డులో చూపిస్తూ అక్రమ బిల్లులు పొందుతున్నట్లు సమాచారం.
అధికారులు కాంట్రాక్టర్ కుమ్మకై కుళ్లిన గుడ్లు సరఫరా..
అంగన్ వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు సరఫరా చేసే ఏజెన్సీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. టెండర్లు చూపిన విధంగా కాకుండా కుళ్లిపోయిన గుడ్లు సరఫరా చేయడంతో టీచర్లకు తలనొప్పిగా మారింది. కుళ్లిపోయిన గుడ్లు సరఫరా చేయడంతో మాకు వద్దని టీచర్లు చెప్పినా పై అధికారి ఒత్తిడి మేరకు తీసుకొనక తప్పడం లేదు. గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్ అధికారులు కుమ్మక్కై ఈ వ్యవహారం కొనసాగుతుంది. కేంద్రాలకు పంపిణీ చేసే గుడ్లు కుళ్లిపోయి నాసిరకంగా ఉంటున్నాయి. సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఏజెన్సీలో ఇష్టారీతిన వివరిస్తున్నాయి. కుళ్లిపోయిన కోడిగుడ్లను లోపంపై ఎప్పటికప్పుడు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నామని టీచర్ వాపోయారు.
నారాయణఖేడ్ మండలంలో తుర్కపల్లి తండా, కంగ్టి మండలం మార్క్ జల, నిజాంపేట్ మండలం దామర చెరువు తో పాటు అన్ని అంగన్ వాడీ కేంద్రాల్లో కుళ్లిపోయిన గుడ్లు సరఫరా చేయడంతో గ్రామస్తులు ఆందోళన చేశారు. గ్రామస్తులు వారి ఇంటి ముందు బాలింతలు, గర్భిణీలు, చిన్నపిల్లలకు కుళ్లిన గుడ్లు ఇవ్వడంతో అదే రోజు గ్రామస్తులు వారి ఇంటి వద్ద ఆ గుడ్లను పగులగొట్టి చూడగా కుళ్లిపోయినట్లు గుర్తించారు. ఇలా శిశువులకు, గర్భిణులకు, పౌష్టికాహారం రూపంలో అందజేసే గుడ్లు కుళ్లిపోయి ఉండటం ఏంటని గ్రామస్తులు ప్రశ్నించారు. ఆరోగ్యం పడితే వాళ్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. నెల రోజులైనప్పటికీ సూపర్వైజర్లు గాని, ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి గాని, జిల్లా అధికారులు కానీ కాంట్రాక్టర్ పై ఇప్పటివరకు సందర్శించిన రోజులు లేవు. గుడ్లను పంపిణీ చేసే కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగానే ఇలాంటి గుడ్లు పంపిణీ జరుగుతున్నాయని కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని గ్రామస్తులు కోరుతున్నారు. అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన రోజు లేవని అధికారులు కాంట్రాక్టర్ కుమ్మకై కుళ్లిన గుడ్లు సరఫరా చేస్తున్నారన్నారు. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో అంగన్ వాడీ సెంటర్ లో మండల సూపర్వైజర్లు తనిఖీ చేయకపోవడంతోనే ఇలాంటి జరుగుతున్నాయని పలువురు కోరుతున్నారు. సూపర్వైజర్లు తెలిపిన పట్టించుకున్న పాపాన లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆరోపణలోచ్చిన చర్యలు శూన్యం...
అంగన్వాడీ కేంద్రాలకు 17 ఏళ్ల నుంచి నారాయణఖేడ్ డివిజన్ కు గుడ్లను సరఫరా చేస్తున్నారన్నారు. ఎక్కడి కాంట్రాక్టర్ నిబంధనలకు ఏమాత్రము పట్టించుకోవడం లేదు. కుళ్లిపోయిన గుడ్లను కూడా సరఫరా చేసిన వారిపై చర్యలు తీసుకున్న దాఖలు లేవు. దీంతో నిత్యము ఎక్కడ ఒకచోట ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. దీంతో పాటు నారాయణఖేడ్ నియోజకవర్గంలో కుళ్లిన గుడ్లు సరఫరా చేస్తున్నారని పలుమార్లు కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేశారు. అయినా వీరిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారడంతో చూసి చూడనట్లు వదిలేస్తారని ఆరోపణ వస్తున్నాయి. టెండర్లు వేసే సమయంలో రూల్స్ పాటిస్తామని ఒప్పందం చేసుకుని, ఆ తర్వాత తమకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. అంగన్వాడీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోడిగుడ్లు సరఫరా చేస్తున్న కాంటాక్ట్ ని బ్లాక్ లిస్టులో పెట్టాలని నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
కేంద్రాలపై పర్యవేక్షణ కరువు...!
నారాయణఖేడ్ డివిజన్ అంగన్ వాడీ కేంద్రాలను పర్యవేక్షించాల్సిన సూపర్ వైజర్లు, సీడీపీఓ తనిఖీలు చేపట్టకుండానే అంగన్ వాడీ కేంద్రాల్లో వస్తువులు వినియోగమైన ట్లు సర్టిఫికెట్లు ఇస్తున్నట్లు విశ్వసనీయంగా సమాచారం. వీటి ఆధారంగానే నియోజకవర్గంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అధికారులకు మామూళ్లు అందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికారుల కనుసన్నుల్లోనే ఈ అక్రమ వ్యవహారమంతా కొనసాగుతున్నది. కుళ్ళిన కోడిగుడ్లు, కాలం చెల్లిన పాల ప్యాకెట్లు, బాలామృతం నిత్యావసర సరుకులతో కిషోర్ బాలికలకు, గర్భిణీలకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, చిన్న పిల్లలకు అంగన్ వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం పేరిట అందిస్తున్నారు.
కాలం చెల్లిన వస్తువులు కుళ్లిన కోడిగుడ్డు వలన కొన్నిచోట్ల బాలింతలు, గర్భిణీ స్త్రీలు, కిశోర బాలికలు, 0-6 బాలికలకు ఈ పౌష్టికాహారం పేరిట అందిన ఆహారం వల్ల అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వెచ్చించి గ్రామీణ ప్రాంత గర్భిణులకు, కిశోర బాలికలకు, బాలింతలకు, బాల బాలికలకు పౌష్టికాహారం అందించాలన్న సదుద్దేశంతో అంగన్ వాడీ కేంద్రాలు ప్రారంభిస్తే, అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మకై, అక్రమాలకు పాల్పడుతున్నారు. జిల్లా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ లలిత కుమారి వివరణ కోరగా ఫోన్ స్పందించలేదు.