బియ్యం మాఫియా.. అధికార పార్టీ అండదండలతో దందా
చౌకధర దుకాణాల ద్వారా పేదలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం తిరిగి నర్సాపూర్ లోని రైస్ మిల్లులకు చేరుతోంది. ఇందుకోసం ఇక్కడ పెద్ద నెట్ వర్కే పనిచేస్తున్నది. రేషన్ బియ్యం గ్రామాల్లోని డీలర్ల వద్దకు రాగానే జనం నుంచి ఆ బియ్యం కొనుగోలు చేసే టీం వస్తుంది.
చౌకధర దుకాణాల ద్వారా పేదలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం తిరిగి నర్సాపూర్ లోని రైస్ మిల్లులకు చేరుతోంది. ఇందుకోసం ఇక్కడ పెద్ద నెట్ వర్కే పనిచేస్తున్నది. రేషన్ బియ్యం గ్రామాల్లోని డీలర్ల వద్దకు రాగానే జనం నుంచి ఆ బియ్యం కొనుగోలు చేసే టీం వస్తుంది. ఎంతో కొంత చెల్లించి వివిధ రకాల వాహనాల్లో బియ్యం మిల్లులకు చేర్చుతుంటారు. రేషన్ బియ్యం ఎక్కడ కొంటారంటే నర్సాపూర్ లో అని ఎవరైనా ఇట్టే చెప్పే స్థాయికి ఇక్కడ బియ్యం మాఫియా ఎదిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఏర్పాటు చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి వడ్లు ఇక్కడి మిల్లులకే మిల్లింగ్ కు వస్తాయి. ఇక్కడి మాఫియా ఆ వడ్లను మిల్లింగ్ చేకుండా ఇతర ప్రాంతాలకు తరలించి అప్పటికే రీసైక్లింగ్ చేసిన రేషన్ బియ్యాన్నే తిరిగి ప్రభుత్వానికి సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. మిల్లింగ్ కోసం నర్సాపూర్ ప్రాంతంలోని మిల్లులకు వడ్లు పంపిస్తే ఏ మిల్లులో కూడా అవి కనిపించకపోవడంతో తనఖీకి వెళ్లిన విజులెన్స్, ఇతర అధికారులు తెల్లముఖం వేశారు. అధికార పార్టీలోనే ముఖ్య నాయకుల అండదండలతో, అధికారుల సహకారంతో బియ్యం మాఫియా దర్జాగా తమ పనికానిస్తుండడం గమనార్హం. నర్సాపూర్ లో రేషన్ బియ్యం మాఫియాపై ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్త్రతంగా చర్చ జరుగుతున్నది.
దిశ, సంగారెడ్డి బ్యూరో : నర్సాపూర్ లో చాలా కాలంగా బియ్యం మాఫియా కొనసాగుతున్నది. అధికార పార్టీ నేతల అండదండలతోనే కొనసాగుతుంటుందని జగమెరిగిన సత్యం. నర్సాపూర్ కు చెందిన ముఖ్య నాయకుల అండదండలు సదరు బియ్యం మాఫియాకు పుష్కలంగా ఉంటాయి. నర్సాపూర్ ఏరియాలో ఏ మిల్లుకు వెళ్లిన అర్థరాత్రి లారీల లోడింగ్, అన్ లోడింగ్ కనిపిస్తుంటుంది. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల నుంచి నర్సాపూర్ లోని రైస్ మిల్లులకు వడ్లు పంపారు. ఆ వడ్లు మిల్లింగ్ చేసి అనుకున్న సమయానికి తిరిగి సివిల్ సప్లయ్ కార్యాలయాలకు చేరవేయాల్సి ఉంటుంది. మిల్లుల నుంచి బియ్యం రాలేదు. దీనితో విజిలెన్స్, ఇతర అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీలో విస్తుపోవడం అధికారుల వంతైది. కేంద్రాల నుంచి వడ్లు వచ్చిన వడ్లు కనిపించలేదు. ఒక వేళ మిల్లింగ్ చేస్తే బియ్యం కూడా కనిపించలేదు. అంటే కేంద్రాల నుంచి వచ్చిన వడ్లను పక్కదారి(ప్రైవేట్ వ్యాపారులకు) పట్టించారు. అధికారుల దాడుల నేపథ్యంలో ఎక్కడో దాచిన రేషన్ బియ్యం తీసుకురావడం ఇబ్బందిగా మారింది. దీనితో బియ్యం మాఫియా తెల్లమొఖం వేసి అధికార పార్టీ నేతల చుట్టూ తిరుగుతున్నట్లు తెలిసింది. దాదాపు రూ.70కోట్ల విలువ చేసే వడ్లు మిల్లుల్లో కనిపించడం లేదని అధికారులుచెబుతున్నారు.
రేషన్ బియ్యం రీసైక్లింగ్..
రేషన్ బియ్యం రీసైక్లింగ్ కు నర్సాపూర్ కేంద్రంగా మారింది. రైస్ మిల్లుల దందాలో ఆరితేరిన వ్యక్తులు ఈ దందా దర్జాగా కొనసాగిస్తున్నారు. నర్సాపూర్, శివ్వంపేట, కౌడిపల్లితో పాటు ఇతర మండలాలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా రేషన్ బియ్యం ఇక్కడి మిల్లులకు చేరుతుంది. నర్సాపూర్ లో గ్రామాలకు వెళ్లి ప్రజల నుంచి బియ్యం కొనుగోలు చేయడానికి ప్రత్యేకంగా కొందరు పనిచేస్తున్నారు. బైకులు మొదలుకుని ఆటోలు ఇతర వాహనాల్లో గ్రామాల్లో తిరిగుతూ బియ్యం కొంటున్నారు. అలా కొనుగోలు చేస్తున్న వారు నేరుగా వచ్చి ఆ బియ్యంను మాఫియా రైస్ మిల్లుల్లో అందిస్తున్నారు. ఇలా ప్రతి నెల టన్నుల బియ్యం వస్తుందని సమాచారం. ప్రజా ప్రతినిధులకు కూడా ఈ విషయం తెలుసు. అయితే బియ్యం మాఫియా వ్యాపారులు అధికార పార్టీ చేపట్టి వివిద కార్యక్రమాల నిర్వహణకు ఆర్థిక చేయూతనందిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మిల్లులకు చేరిన రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి తిరిగి అవే ప్రభుత్వానికి సరఫరా చేస్తూనే ఉన్నారు.
ఆ మిల్లులకే ఎందుకు అనుమతి..?
అక్రమాలు, రీసైక్లింగ్ కు కేంద్రంగా మారిన నర్సాపూర్ ప్రాంత రైస్ మిల్లులకు ప్రభుత్వం కేంద్రాల నుంచి మిల్లింగ్ కు వడ్లు సరఫరా చేయడం వివాదంగా మారుతున్నది. నర్సాపూర్ పేరు చెబితేనే బియ్యం మాఫియా అంటుంటారు. అలాంటిది మిల్లింగుకు ప్రభుత్వం నుంచి వడ్లు ఎందుకు పంపిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకుల అండదండలుంటే ఎన్ని అక్రమాలైనా చేయవచ్చునా..? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ దాడులు ఈ మిల్లులపై జరగడం, అవే మిల్లలతో తిరిగి మిల్లింగ్ ఒప్పందాలు చేసుకోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది. నర్సాపూర్ లో ఇంత దర్ఝాగా బియ్యం మాఫియా కొనసాగించడానికి ఎవరి అండదండలున్నాయని అన్ని వర్గాల్లో చర్చ జరుగుతున్నది.