కాంగ్రెస్‌తో కరువొచ్చింది… ప్రాజెక్టుల గేట్లు ఓపెన్ చేయండి

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే కరువొచ్చిందని, ఎండిన పంట పొలాలకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Update: 2024-03-27 12:51 GMT

దిశ, చేగుంట: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే కరువొచ్చిందని, ఎండిన పంట పొలాలకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నార్సింగి మండల పరిధిలోని నర్సంపల్లి తండాలో ఎండి పోయిన వరి పంట పొలాలను బుధవారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ… ఎన్నో సంవత్సరాల నుంచి వ్యవసాయం మీద ఆధారపడి బతికే రైతు కుటుంబాలు, తండా సోదరులు పంటలు ఎండిపోవడంతో నష్టపోవడం జరిగిందన్నారు. పంట పొలాలను కాపాడటానికి ప్రాజెక్టుల గేట్లు ఎత్తాలని, అది మరిచి ప్రతిపక్ష నాయకులను చేర్చుకోవడానికి పార్టీ గేట్లు ఎత్తుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు భరోసా, రుణమాఫీ ఏమైందని ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కరెంటు కూడా సక్రమంగా రావట్లేదు ..ఇప్పటికైనా నీళ్లు విడిచి పంటలను కాపాడాలన్నారు.. ఎండిపోయిన పంటలకు ఎకరానికి రూ. 15 వేల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్నోళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వారిని పార్టీలోకి తీసుకెళ్లడం మానుకోవాలన్నారు. రైతులు పంటలు ఎండిపోయి నానా ఇబ్బందులు పడుతుంటే మీరేమో హైదరాబాద్‌లో కూర్చొని మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నుంచి పంట పొలాలకు నీళ్లను విడుదల చేసి వాగు వంకలు, చెరువు, కుంటలు నింపాలని ఆయన కోరారు. ఈ పరిశీలన కార్యక్రమంలో నార్సింగ్ జడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, చేగుంట జడ్పీటీసీ ముడాం శ్రీనివాస్, చేగుంట మాజీ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ మల్లేశం గౌడ్, పెద్దతండా మాజీ సర్పంచ్ క్షత్రియ నాయక్, రైతులు నాయకులు పాల్గొన్నారు.


Similar News