సైబర్ నేరగాళ్ల పంజా...ప్రముఖ ఇంజనీర్ డిజిటల్ అరెస్ట్

సైబర్ నేరగాళ్ల పంజా విసిరారు.. భారీ ఆర్థిక నేరానికి స్కెచ్ వేశారు. ముంబాయి నుంచి ఆర్బిఐ అధికారినంటూ జహీరాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ ఇంజనీర్ ను గంటపాటు కదలనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేశాడు.

Update: 2024-12-03 15:34 GMT

దిశ, జహీరాబాద్: సైబర్ నేరగాళ్ల పంజా విసిరారు.. భారీ ఆర్థిక నేరానికి స్కెచ్ వేశారు. ముంబాయి నుంచి ఆర్బిఐ అధికారినంటూ జహీరాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ ఇంజనీర్ ను గంటపాటు కదలనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఇది గమనించిన బాధితుడి భార్య సమయస్ఫూర్తితో వ్యవహరించి మంచినీటి కోసం అంటూ కిచెన్ లో నుంచి ఇంటి బయటికి వచ్చి నెంబర్ 100కు ఫోన్ చేసింది.

అప్రమత్తమైన సైబర్ క్రైమ్ వారియర్

ఆర్థిక నేరం జరగకుండా బాధితుడికి ఊరట కల్పించారు. పోలీసులు ఎవరిని డిజిటల్ అరెస్ట్ చేయరని, అలాంటిదేమీ లేదని పేర్కొంటూ భయపడొద్దని సూచించారు. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. జహీరాబాద్ పట్టణంలోని మహేంద్రా కాలనీలో నివాసం ఉంటున్న ప్రముఖ కంపెనీకి చెందిన క్వాలిటీ కంట్రోలర్ను కృష్ణ డిజిటల్ అరెస్టు చేశారు.

ఉద్యోగానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న కృష్ణకు ముంబాయి ఎస్బీఐ బ్యాంకు నుంచి ఆకాశ్ శర్మ అనే ఉద్యోగి నంటూ సైబర్ నేరగాడు ఫోన్ చేశాడు. వ్యక్తిగత ఖాతకు సంబంధించి సమస్యలు ఉన్నాయి, వాటిని సంబంధించిన వివరాలను వీడియో కాల్ ద్వారా తెలపాల్సి ఉంటుందని గద్దించాడు. వీడియో కాల్ ద్వారా వ్యక్తిగత ఖాతా కు సంబంధించిన వివరాలను తెలిపేటప్పుడు ఆర్బీఐ అధికారులు కూడా లింక్ లో ఉంటారని సైబర్ నేరగాడు నమ్మబలికారు. వ్యక్తిగత ఖాతకు సంబంధించిన వివరాలను చెప్పే వరకు ఎక్కడకు వెళ్లరాదని ఆదేశించాడు. వారిద్దరి మధ్య జరుగుతున్న తతంగాన్ని గమనించిన అధికారి భార్యకు అనుమానం వచ్చి వెంటనే అప్రమత్తమైంది. వంటగదిలో నుండి బయటకు వచ్చి నెంబర్.100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది.

జహీరాబాద్ పట్టణ ఎస్ఐ కాశీరాధ్ ఆదేశాల మేరకు వెంటనే పట్టణ సైబర్ క్రైం వా‌రియర్ రషీద్ సిబ్బందితో కలిసి అధికారి కృష్ణ ఇంటికి చేరుకున్నారు. వీడియో కాల్లో సైబర్ నేరగాడితో అధికారి కృష్ణ మాట్లాడుతుండగా, ఇంట్లోకి ఎవరో వచ్చారని సైబర్ నేరగాడు ఆడగా, నా తమ్ముడు వచ్చాడని చెప్పడంతో అప్రమత్తమయ్యాడు. సైబర్ క్రైం పోలీసులు ఇంట్లోకి వచ్చారని గమనించిన సైబర్ నేరగాడు ఫోన్ కట్ చేసి తప్పించుకున్నాడు. మళ్లీ సైబర్ నేరగాడికి ఫోన్ చేసిన లాభం లేకుండా పోయింది.

సైబర్ క్రైం ఎంట్రీ తో తప్పిన ఆర్థిక ముప్పు

సైబర్ క్రైమ్ పోలీసులు ఇంటికి రావడం వల్ల సైబర్ మోసం, ఆర్థిక ముప్పు నుంచి బయట పడిన అధికారి కృష్ణ ఊపిరిపీల్చుకున్నాడు. గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరాదని సైబర్ క్రైం అధికారి రషీద్ సూచించారు. లోన్ వచ్చిందని, బ్యాంకు ఖాతలో సమస్యలున్నాయని, లాటరీ తగిలిందని, ఫెడెక్స్ కొరియర్, ట్రాయ్, బ్యాంకు అధికారులంటూ... కాల్స్ వస్తే జాగ్రత్తగా వ్యవహించాలని సూచించారు. స్కామర్లకు భయపడి వ్యక్తిగత వివరాలను చెప్పవద్దన్నారు. భయపడిపోయి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొద్దు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే సైబర్ క్రైం హెల్ప్ లైన్ నంబర్ 1980 లేదా cybercrime.gov in ఫిర్యాదు చేయాలని సూచించారు.


Similar News