నా గెలుపు ఊహించినదే.. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి..
దుబ్బాక ప్రజలు తన వెన్నంటే ఉన్నారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.
దిశ, దుబ్బాక : దుబ్బాక ప్రజలు తన వెన్నంటే ఉన్నారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. కత్తిపోటుకు గురై 25 రోజుల పాటు ఆస్పత్రిలో ఉండి ప్రచారానికి దూరమైనప్పటికీ దుబ్బాక నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తన గెలుపుని వారి భుజాల పై వేసుకొని తనను దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు. ఓట్ల లెక్కింపు అనంతరం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ఇంత పెద్ద విజయం కట్టబెట్టిన నియోజకవర్గ ప్రజలకు తన గెలుపు అంకితం చేస్తున్నానని దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేపటి రోజు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల పథకాలు అమలు చేసే వరకు ప్రజలతో కలిసి ప్రభుత్వంతో పోరాడతామన్నారు. ఏ ఆలోచనతోనైతే దుబ్బాక ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించారో వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా దుబ్బాక అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పై రాజీలేని పోరాటం చేసి దుబాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.