Dipadas Munshi : స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి

రాబోయే స్థానిక సంస్థలు అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కలిసి కట్టుగా పని చేయాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లు పిలుపునిచ్చారు

Update: 2024-10-15 15:12 GMT

దిశ, సంగారెడ్డి బ్యూరో : రాబోయే స్థానిక సంస్థలు అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కలిసి కట్టుగా పని చేయాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లు పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఉమ్మడి మెదక్ జిల్లా పార్టీ సమీక్ష సమావేశం జరిగింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించగా దీపాదాస్ మున్షీ, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి, అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయాల కోసం అంతా కలిసికట్టుగా పని చేయాలన్నారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. ప్రధానంగా ఆయా నియోజకవర్గ ఇంచార్జ్ లు భేషజాలకు పోకుండా కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు తేవాలన్నారు. ప్రజలకు, పాలనా యంత్రాంగానికి మధ్య పార్టీ నాయకత్వం వారధిగా పనిచేసి ప్రభుత్వానికి మంచిపేరు తేవాలన్నారు. స్థానికంగా ప్రతిపక్షాలు చేసే ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి సత్తా చాటాలని సూచించారు.

ఈ సమీక్షలో ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథం, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, టీజీఐసీసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్, మాజీ ఎమ్మల్యే, సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నియోజకవర్గ ఇన్చార్జీలు నర్సాపూర్ రాజిరెడ్డి, దుబ్బాక-చెరుకు శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట- పూజల హరి కృష్ణ, ఉమ్మడి మెదక్ జిల్లా టీపీసీసీ ఆఫీస్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.


Similar News