విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పోలీసులను సస్పెండ్ చేయాలి : ఎంపీ రఘునందన్ రావు
మెదక్ లో జరిగిన అల్లర్లలలో బాధ్యత రహితంగా విధులు నిర్వహించిన పోలీస్ లను సస్పెండ్ చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
దిశ, మెదక్ ప్రతినిధి : మెదక్ లో జరిగిన అల్లర్లలలో బాధ్యత రహితంగా విధులు నిర్వహించిన పోలీస్ లను సస్పెండ్ చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. మెదక్ జైల్ లో ఉన్న బీజేపీ నేతలను మంగళవారం కలిసి పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ మెదక్ లో జరిగిన అల్లర్ల విషయంలో తాము సంయమనం పాటించి సహకరిస్తే పోలీసుల తీరు సరిగ్గాలేదని మండిపడ్డారు. కేసు విచారణలో హిందూలకు ఒక నీతి, ముస్లింలకు ఒక నీతి అన్నట్టుగా ఉందని ఆరోపించారు. మహిళా ఏఎస్సైని బూతులు తిట్టినా ఎందుకు కేసునమోదు చేయలేదని ప్రశ్నించారు. చిన్న పిల్లలను ఆధార్ కార్డు తీసుకు రమ్మని పోలీస్ స్టేషన్ లకు పిలిపించి గంటల పాటు కూర్చోబెట్టి, వారి మొబైల్స్ ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. పోలీసులు బయపెడితే భయపడే గడ్డ కాదని, నిజాం సర్కార్ ను కారం పొడి కొట్టిన తెలంగాణ గడ్డ అని గుర్తు చేశారు.
తెలంగాణ కోసం ఉద్యమాలు చేసి ఇక్కడికి వచ్చామని, ఒక వర్గానికి కొమ్ముకాస్తే ఊరుకోమని అన్నారు. తప్పు చేసిన వారిని శిక్షించాలని, కానీ ఏఎస్సై పట్ల బూతులు తిట్టినా వారి పై ఎందుకు కేసులు నమోదు చేయలేదో సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ఫోన్ ట్యాపింగ్ లో పింక్ యూనిఫాం వేసుకున్న వారు అతి ఉత్సాహం చూపి జైల్ లో ఊసలు లెక్కిస్తున్నారని అన్నారు. అది మెదక్ లో పునరావృతం కాకుండా చూడాలని హితవు చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అరీఫ్ ను ఆసుపత్రికి పోలీసులు వెళ్లి చూశారా.
మెదక్ లో ప్రభుత్వ ఆసుపత్రి లేవా.. ఉర్దూలో రాసిన పిటిషన్ ను పోలీసులు తెలుగులో తప్పుడు ఫిర్యాదుగా మార్చి రాస్తారా అని ప్రశ్నించారు. ఐజీ రంగనాథ్ గతంలో బీజేపీ పై అతిగా వ్యవహరించి సంగభంగం పొందాడని, ఇక్కడ అలా కాకుండా చూడాలని చెప్పారు. పోలీసులు కోరితే సంయమనం పాటించాలని, దీనితో అసమర్థతగా భావించవద్దని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరిఫ్ ను డిశ్చార్జ్ చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న 12 మందిని వదిలే వరకు ఎస్పీ కార్యాలయంలోనే ఉంటానని ఎంపీ అన్నారు.