ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ శరత్
జిల్లాలో ఉష్ణోగ్రతల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సూచించారు.
దిశ , సంగారెడ్డి : జిల్లాలో ఉష్ణోగ్రతల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సూచించారు. ఉష్ణోగ్రతలు పెరిగి, వడగాలులు వీస్తున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అధిక జన సంచారం ఉండే ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని, సరిపడా ఓఆర్ఎస్ ప్యాకెట్లను అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, అంగన్ వాడీ కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు.
పశువుల దాహార్తి తీర్చేలా తగు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణకు క్రమం తప్పకుండా నీరు పోయాలన్నారు. అత్యవసర సమయాల్లో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగులు, చేతి రుమాలు, టవల్ వినియోగించాలని, బయటి పదార్థాలు తినకూడదని, ఎక్కువగా నీళ్లను తాగాలని, పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ లాంటి ద్రవ పదార్థాలను తీసుకోవాలన్నారు. ఎవరైనా వడదెబ్బకు గురైతే వెంటనే దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి సకాలంలో చికిత్స పొందాలని సూచించారు.
ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఎండలో బయట తిరగొద్దని, వడదెబ్బ తగిలే అవకాశం ఉందన్నారు. ప్రజలు వీలైనంత వరకు పగటి పూట ఇంటి వద్దనే గడపాలని, అత్యవసర పనులకు మాత్రమే బయటకు రావాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఎండల తీవ్రతకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఆయా శాఖల అధికారులు ఎప్పటికప్పుడు తగిన సూచనలు చేస్తూ ప్రజలను చైతన్యవంతు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.