బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి
మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ, మాజీ కలెక్టర్ వెంకట్రాంరెడ్డి పేరు దాదాపు ఖరారయ్యింది.
దిశ, సంగారెడ్డి బ్యూరో: మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ, మాజీ కలెక్టర్ వెంకట్రాంరెడ్డి పేరు దాదాపు ఖరారు అయ్యింది. పలు మార్లు సమీక్ష సమావేశాల తర్వాత పార్టీ అధినేత కేసీఆర్ వెంకట్రాంరెడ్డి పేరు ప్రకటించారు. ఈ స్థానం నుంచి టికెట్ ఆశించిన వంటేరు ప్రతాప్ రెడ్డి సున్నితంగా పోటీ నుంచి తప్పుకున్నారు. మరో అభ్యర్థి గాలి అనిల్ కుమార్‌కు జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవతో వెంకట్రాంరెడ్డిని ఫైనల్ చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించగా ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. కాగా వెంకట్రాంరెడ్డి ఉమ్మడి జిల్లాలో డ్వామా పీడీ మొదలుకుని అడిషనల్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గా, 2014 నుంచి 2017 వరకు ఉమ్మడి జిల్లా జేసీగా పనిచేశారు. ఆ తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా సుదీర్ఘకాలం ఐదేండ్లు పనిచేశారు. ఆ తరువాత మెదక్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్‌గా కూడా ఇక సంవత్సరం పాటు విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.
.