అవ్వా... కళ్లు ఎట్లా కనిపిస్తున్నాయ్...? : హరీశ్ రావు

దిశ, సిద్దిపేట: అవ్వా కండ్లు ఎట్లా కనిపిస్తున్నాయ్.? ఏంది బిడ్డా వినిపిస్తలేదు.....Minister Harishrao helps to poor people

Update: 2022-08-15 10:50 GMT

దిశ, సిద్దిపేట: అవ్వా కండ్లు ఎట్లా కనిపిస్తున్నాయ్.? ఏంది బిడ్డా వినిపిస్తలేదు... కండ్లు మంచిగా కనిపిస్తున్నాయా.?... ఆ.. మంచిగ కనిపిస్తున్నయ్ బిడ్డా... మందులు ఇచ్చిండ్రా.?... ఆ ఇంచ్చిండ్రు.. వేసుకుంటున్నా.. ఆపరేషన్ చేయించావ్, కండ్ల అద్దాలు ఇప్పించావ్ నీకడుపు సల్లగుండా అంటూ మంత్రి హరీష్ రావుకు కండ్ల అద్దాలు తీసుకున్న లచ్చవ్వ మధ్య జరిగిన సంభాషణ ఇది.

కంటి సమస్యలతో ఎవ్వరూ బాధపడొద్దన్నదే తన తాపత్రయమని.. గ్రామాలల్లో కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి.. నేత్ర సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించడంతోపాటుగా ఉచితంగా కంటి అపరేషన్లు, మందులు అందిస్తున్నట్లు రాష్ర్ట ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కళ్ల అద్దాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిద్ధిపేట నియోజకవర్గంలో 762 మందికి కంటి ఆపరేషన్లు, మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. మరో 1800 మందికి కాటారాక్ట్ ఆపరేషన్లు చేపించాల్సి ఉందని మంత్రి వెల్లడించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రతి ఏఎన్ఎం సెంటర్ కు ఒకస్టాఫ్ నర్స్ నియామకం చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ మాట్లాడుతూ.. కంటి సంబంధిత వ్యాధులకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవతో ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి నెలకొల్పడం జరిగిందన్నారు. కంటి సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారికి అపరేషన్లు చేయించడంతోపాటుగా భోజనం పెట్టి, ఆటోలో ఇంటికి పంపిస్తున్న మానవతామూర్తి హరీష్ రావు అని ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ కాశీనాథ్, నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల, గ్రామాల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


Similar News