దిశ, సిద్దిపేట ప్రతినిధి: మత సామరస్యానికి ప్రతీకగా సిద్ధిపేట నిలిచింది. ఎప్పటిలాగే ఈ యేడు సిద్ధిపేటలో పవిత్ర రంజాన్, శ్రీరామ నవమి పండుగలు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సామరస్యంగా జరుపుకునేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కోరారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, సీపీ శ్వేత, ప్రజాప్రతినిధులు పండుగలు, మహానీయుల జయంతి, వర్థంతి వేడుకల నిర్మహణ పై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రంజాన్ మాసం పురస్కరించుకొని మసీదుల వద్ద మౌళిక వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను అదేశించారు.
శ్రీరామ నవమి ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. అదే విధంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి, జ్యోతిరావు పూలే జయంతి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిలకు ఏర్పాట్లు చేయాలన్నారు. మహానీయుల చరిత్ర భావితరాలకు తెలియ జేసే విధంగా పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు పోటీలు నిర్వహించాలన్నారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని సిద్ధిపేట అర్బన్-85 మందికి కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు, సిద్దిపేట రూరల్ మండలం మాచాపూర్, సీతారాంపల్లి గ్రామానికి చెందిన 34 మంది లబ్దిదారులకు అసైన్మెంట్ పట్టా సర్టిఫికేట్లు, నంగునూరు మండలం కోనాయిపల్లి గ్రామానికి చెందిన 28 మందికి ఇళ్ల పట్టాలను, విద్యుత్తు ప్రమాదంలో మృతి చెందిన వారికి భీమా చెక్కులను, అలాగే చిన్నకోడూర్ మండలంలో 66 మంది భూ నిర్వాసితులకు రూ.95 లక్షల చెక్కులను మంత్రి హరీష్ రావు అందజేశారు.
అనంతరం కొండా భూదేవి గార్డెన్స్ లో జీఓ 58, 59 కింద లబ్ధిదారులకు భూ యాజమాన్య హక్కు పత్రాలు మంత్రి హరీశ్ రావు అందజేశారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి. మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, బీఆర్ ఎస్ నాయకులు కొండం. సంపత్ రెడ్డి, మచ్చ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.