మెదక్ పార్లమెంట్ బీ‌ఆర్‌ఎస్ కంచు కోట..!

మెదక్ పార్లమెంట్ సీటు బీ‌ఆర్‌ఎస్ కంచు కోట అందరం కష్టపడి భారీ మెజార్టీతో వెంకట్రారామ్ రెడ్డిని గెలిపించాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.

Update: 2024-03-26 16:20 GMT

దిశ, మెదక్ టౌన్: మెదక్ పార్లమెంట్ సీటు బీఆర్ఎస్‌కు కంచుకోట.. అందరం కష్టపడి భారీ మెజార్టీతో వెంకట్రామి రెడ్డిని గెలిపించాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మంగళవారం మెదక్‌లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో పాటు మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. 100 రోజుల కాంగ్రెస్ పాలనతో ప్రజలందరికీ అర్ధమైందని అన్నారు. మెదక్ పార్లమెంట్ సీటు అంటే బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని.. అలాంటి సీటును వెంకట్రామిరెడ్డికి ఇవ్వడం మంచి పరిణామం అన్నారు. బీజేపి ఎంపీ అభ్యర్థి దుబ్బాక ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తి అని.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేనోడు.. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా గెలుస్తాడని ఎద్దేవా చేశారు. వెంకట్రామి రెడ్డి ఉమ్మడి జిల్లాలో పనిచేసినప్పుడు దగ్గరగా చూసానని.. రోజు 15 గంటలు పనిచేసే వ్యక్తి అన్నారు. మెదక్ ఎమ్మెల్యే లేని లోటు ఎంపీగా వెంకట్రామి రెడ్డిని గెలిపించుకుని తిర్చుకుందామని పిలుపునిచ్చారు. గత డిసెంబర్‌లో రుణమాఫీ చేస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశారని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అందరినీ మోసం చేస్తోందని అన్నారు. రైతుబంధు డబ్బులు వచ్చినోళ్లు కాంగ్రెస్‌కు, రానోళ్లు బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని కోరారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటు కోసం వస్తే ఆరు గ్యారెంటీల గురించి నిలదీయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలన చేసిన 100 రోజుల్లో ఆటో డ్రైవర్స్, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న మహిళలకు రూ.2500 చొప్పున రూ.10 వేల బాకీ ఉన్నాడని అన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరు గ్యారెంటీలపై చర్చ పెట్టాలని అన్నారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని అన్నారు. బీజేపీ వాళ్లు రామాలయం కట్టి రాజకీయం చేస్తున్నారని, మాకు కూడా దేవుడిపై భక్తి ఉందని.. కానీ రాజకీయాల కోసం దేవుడిని వాడుకోం అని అన్నారు. ఇకనైనా బీజేపీ నేతలు రాజకీయాల కోసం దేవుడిని వాడుకోవడం ఆపాలని తెలిపారు.

ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. 25 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో 11 సంవత్సరాలు ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు ఉద్యోగ బాధ్యతలతో నాకు అనుబంధం ఉందని అన్నారు. మెదక్ జిల్లా ప్రజలకు నేను రుణపడి ఉంటా, ఒక ఐఏఎస్ అధికారిగా ఉమ్మడి జిల్లాలో 11 సంవత్సరాలు పనిచేసే అరుదైన అవకాశం నాకు వచ్చిందని అన్నారు. ప్రజలకు సేవల చేయాలనే ఉద్దేశంతో నా కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీగా నాకు అవకాశం ఇచ్చారని అన్నారు. ఇప్పుడు మళ్లీ ఎంపీ అభ్యర్థిగా కూడా అవకాశం ఇచ్చారని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్‌లో రాష్ట్ర ప్రజల గొంతు వినిపిస్తానని తెలిపారు. రాజకీయాలకు నేను డబ్బులు సంపాదించడానికి రాలేదనీ.. సేవ కోసమే వచ్చానని అన్నారు. ఎంపీగా గెలిచిన తరువాత రూ.100 కోట్ల సొంత డబ్బులతో పీవీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి నిరుపేదలకు సహాయం చేస్తానని తెలిపారు. మెదక్ పార్లమెంట్ ప్రజల ఆశీర్వాదంతో 50 వేల మెజారిటీతో గెలిపిస్తారని నమ్మకం ఉందని అన్నారు.


Similar News