Gouravelli Project:‘గౌరవెల్లి’కి మహర్దశ
మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గాన్ని గోదావరి జలాలు తీసుకొచ్చి సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా చేపట్టిన గౌరవెల్లి ప్రాజెక్టుకు మహర్దశ పట్టనుంది.
దిశ ప్రతినిధి,సిద్దిపేట:మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గాన్ని గోదావరి జలాలు తీసుకొచ్చి సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా చేపట్టిన గౌరవెల్లి ప్రాజెక్టుకు మహర్దశ పట్టనుంది. గౌరవెల్లి ప్రాజెక్ట్‌తో పాటు ఎస్ఆర్ఎస్పీ - ఐఎఫ్ఎఫ్ సీలోని ప్యాకేజీ నంబర్ -7 లోని పెండింగ్ పనులు పూర్తి చేయడానికి రూ.437 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో గౌరవెల్లి ప్రాజెక్టును 1.45 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ ఆర్ సీఎంగా ఉన్న సమయంలో పనులు మొదలయ్యాయి. 2014 లో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రాజెక్టు రీ డిజైన్ చేసి సామర్థ్యాన్ని 8.2 టీఎంసీలకు పెంచింది.
రీడిజైన్ తో ప్రాజెక్టు సామర్థ్యం పెంచడంతో గౌరవెల్లి ప్రాజెక్టు కోసం మొత్తం 3,919 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. గత ప్రభుత్వంలో పనులన్నీ పూర్తి కాకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ నిధులు కేటాయించి ప్రాజెక్టును కొనసాగిస్తున్నది. ఈ ప్రాజెక్టు పూర్తయితే మూడు జిల్లా పరిధిలోని 104 గ్రామాల్లోని లక్షా ఆరు వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. అందులో హుస్నాబాద్ నియోజకవర్గంలోని 57,852 ఎకరాలు సస్యశ్యామలం కానుంది. ప్రాజెక్టు పనుల కోసం నిధులు కేటాయించిన సహచర మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.
* నిధులతో పనుల్లో వేగం..
గౌరవెల్లి ప్రాజెక్ట్ కోసం నిధుల కేటాయింపులో పనుల్లో వేగం పుంజుకోనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే రిజర్వాయర్ పనులు మొదలయ్యాయి. 13.07.2007 న ఈ ప్రాజెక్ట్ ను ఎస్ఆర్ఎస్పి రెండవ దశ లో వరద ప్రవాహం కాలువ ప్రాజెక్టు కింద పనులు చేపట్టడానికి రూ.913.15 కోట్ల రూపాయల తో పనులు చేపట్టడానికి నాటి ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. సంబంధిత రిజర్వాయర్ కాలువ పనులు చేపట్టడానికి ప్యాకేజీ -7 లో రూ. 278.58 కోట్ల రూపాయలను సమకూర్చింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమి - 3919 ఎకరాలు కాగా ,సేకరించిన భూమి 1676 ఎకరాలు, సేకరించవలిసిన మిగులు భూమి 2243 ఎకరాలు గా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ లో సీడీ అండ్ సీఎం పనులు పెండింగ్ లో ఉన్నాయి.
* లక్షా ఆరు వేల సాగునీరు..
గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయితే లక్షా ఆరు వేల (1,06,000 ) ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో ( అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడ, సైదాపూర్, చిగురుమామిడి, భీమదేవరపల్లి మండలాల పరిధిలో) 57,852 ఎకరాలు , స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో (వేలేరు, ధర్మసాగర్, ఖాజీపేట, చిల్ పూర్, స్టేషన్ ఘన్ పూర్, రఘనాథపల్లి, జాఫర్ గడ్క్ష మండలాల పరిధిలో) 48,148 ఎకరాలకు సాగునీరు అందనుంది. గౌరవెల్లి ప్రాజెక్ట్ లో ఉన్న రెండు ప్రధాన కాలువల్లో కుడి కాలువ ద్వారా 90,000 ఎకరాలు , ఎడమ కాలువ ద్వారా 16 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. గౌరవెల్లి ప్రాజెక్టు నుంచి మూడు జిల్లాల పరిధిలోని 104 గ్రామాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు ట్రయల్ రన్ నిర్వహించారు.
* సీఎం రేవంత్ రెడ్డి హామీ.. మంత్రి పొన్నం కమిట్‌మెంట్
హుస్నాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ ప్రాధాన్యత ప్రాజెక్టుల లిస్ట్ లో గౌరవెల్లి ప్రాజెక్టు చేర్చారు. ఈ క్రమంలో 2023 మార్చి 2వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లు గౌరవెల్లి ప్రాజెక్టు సందర్శించి ప్రాజెక్టును ప్రారంభించింది. కాంగ్రెస్ ప్రభుత్వమే..పూర్తి చేసే ది కాంగ్రెస్ ప్రభుత్వమే అని వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీ మేరకు ప్రాజెక్టు నిధులు కేటాయించారు. ఇదిలా ఉంటే ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ గౌరవెల్లి ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో వరస సమీక్షా సమావేశాలు నిర్వహించారు.
ప్రాజెక్ట్ పూర్తి చేసుకొని నెర్రెలు బారిన హుస్నాబాద్ నియోజకవర్గంలో గోదావరి నీళ్ళు చేరి పాడి పంటలతో సస్యశ్యామలం అవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. గౌరవెల్లి ద్వారా నీళ్ళు అందించడమే తన జీవిత ఆశయం..ఆశయ సాధన కోసం నిరాటంకంగా పని చేస్తా అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సహచర కేబినెట్ మంత్రులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.