ఇష్టపడి చదవండి..లక్ష్యాన్ని సాధించండి: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
ప్రతి విద్యార్థి జీవితంల పదో తరగతి పరీక్షలు అత్యంత కీలకమని, ఇష్టపడి చదివి.. లక్ష్యాన్ని సాధించాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
దిశ, పటాన్ చెరు: ప్రతి విద్యార్థి జీవితంల పదో తరగతి పరీక్షలు అత్యంత కీలకమని, ఇష్టపడి చదివి.. లక్ష్యాన్ని సాధించాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సౌజన్యంతో నియోజకవర్గంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న 5వేల మంది విద్యార్థులకు ప్రముఖ మానసిక వ్యక్తిత్వ నిపుణులు డాక్టర్. సతీష్ తో మోటివేషనల్ తరగతులు నిర్వహించారు. అనంతరం ప్రతి విద్యార్థికి స్టడీ మెటీరియల్, పరీక్షా ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వ విద్యా రంగానికి రూ.వేల కోట్లు కేటాయించారని తెలిపారు. మన ఊరు.. మనబడి పథకం ద్వారా విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని పర్కొన్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు దొరికని పరిస్థితి ఏర్పడిందన్నారు. పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని పదో తరగతి విద్యార్థులందరికీ తన సొంత ఖర్చుతో అత్యంత విలువైన సమాచారంతో కూడిన స్టడీ మెటీరియల్, పరీక్ష సామాగ్రి పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
పరీక్షలు పూర్తయ్యే వరకు విద్యార్థులందరూ మొబైళ్ల కు, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలన్నారు. తల్లితండ్రులు సైతం ఎటువంటి పనులు చెప్పకుండా వారి పూర్తి సహకారాన్ని అందజేయాలని సూచించారు. పదో తరగతి ఫలితాలపైనే విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని అందర గమనించాలని కోరారు. అనంతరం డాక్టర్ సతీష్ మాట్లాడుతూ ఒత్తిడికి గురి కాకుండా విద్యార్థులంతా ఇష్టపడి చదవాలని సూచించారు. అదేవిధంగా ఒత్తిడిని అధిగమించే వారికి కొన్ని మెలకువలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.