సీపీఆర్ నేర్చుకుందాం.. విలువైన ప్రాణాలను కాపాడుకుందాం: హరీష్ రావు
సీపీఆర్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయకుండా.. చక్కగా నేర్చుకుని విలువైన ప్రాణాలను కాపాడుకుందాం అని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.
దిశ సిద్దిపేట ప్రతినిధి: సీపీఆర్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయకుండా.. చక్కగా నేర్చుకుని విలువైన ప్రాణాలను కాపాడుకుందాం అని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పోలీస్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వ అధికారులకు సీ పీ ఆర్ పై శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కార్డియాక్ అరెస్టుతో దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 15 లక్షల మంది చనిపోతున్నట్లు తెలిపారు.
ఓ సర్వే ప్రకారం అవగాహన లేని కారణంగా రోజుకు 4వేల మంది చనిపోతున్నట్లు పేర్కొన్నారు. ఓ సర్వే ప్రకారం కార్డియాక్ అరెస్ట్ గురైనవాళ్లలో రోజుకు 400 మంది మాత్రమే బ్రతుకుతున్నట్లు పేర్కొన్నారు. సీపీఆర్ నేర్చుకుంటే రోజుకు 2వేల మందిని బతికించుకునే వీలుంటుందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా సీపీఆర్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ప్రజలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీపీఆర్ శిక్షణ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దీనికి తోడు అపార్ట్మెంట్లు గ్రేటర్ కమ్యూనిటీలలో సీపీఆర్ మిషన్ ఉంటేనే అనుమతి ఇచ్చేలా మున్సిపల్ చట్టానికి సవరణ తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ రోజా శర్మ, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, పోలీస్ కమిషనర్ శ్వేత, ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. ఇంతకుముందు ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సీపీఆర్ నిర్వహించి అవగాహన కల్పించారు. అదేవిధంగా ఇటీవల సీపీఆర్ నిర్వహించి ప్రాణాలను కాపాడిన 108 సిబ్బందిని మంత్రి హరీష్ రావు సన్మానించారు.