ఖమ్మంపల్లి శివారులో చిరుతపులి అడుగుల ఆనవాళ్లు...

కొండపాక మండలం ఖమ్మంపల్లి శివారులోని వ్యవసాయ బావుల వద్ద చిరుతపులి అడుగుల ఆనవాళ్లు ఉదయం కనబడడంతో గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

Update: 2024-11-19 10:58 GMT

దిశ, కొండపాక: కొండపాక మండలం ఖమ్మంపల్లి శివారులోని వ్యవసాయ బావుల వద్ద చిరుతపులి అడుగుల ఆనవాళ్లు ఉదయం కనబడడంతో గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గ్రామానికి చెందిన రైతు పెద్ద సాయిగారి మల్లయ్య బర్రె పాలు పిండుకొని ఇంటికి వస్తుండగా తోళ్ల మల్లయ్య పొలం పక్కన సొసైటీ రోడ్డుపైన పులి అడుగుల ఆనవాళ్లు కనబడ్డాయి. వాటిని చూసి భయభ్రాంతులకు గురైన రైతు గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. ఈ విషయాన్ని వెంటనే గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇక్రముద్దీన్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ పద్మ తోపాటు సిబ్బంది చేరుకొని పులి అడుగుల ఆనవాళ్లను పరిశీలించారు. అవి పులి అడుగులేనని నిర్ధారించుకుని దాని కదలికలపై నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. రైతులు పొలాల దగ్గరికి వెళ్ళేటప్పుడు టార్చ్ లైట్లు దగ్గర ఉంచుకొని నాలుగురు, ఐదుగురు కలిసి వెళ్లాలని, జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అవసరమైతే బోన్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇటీవలనే సిద్దిపేట సమీపంలోని బూరుగుపల్లి ప్రాంతంలో పులులు సంచారం ఉన్నట్లు సమాచారం వచ్చిన విషయం తెలిసిందే.


Similar News