వ్యవసాయ అధికారులు - సమయానికి రారు..

వ్యవసాయ శాఖ అంటే రైతులతో మమేకమై రైతుల సమస్యలను తెలుసుకోవాలి కానీ అధికారులంతా ఆఫీస్కే పరిమితం అవుతున్నారు.

Update: 2024-11-19 09:49 GMT

దిశ, దౌల్తాబాద్ : వ్యవసాయ శాఖ అంటే రైతులతో మమేకమై రైతుల సమస్యలను తెలుసుకోవాలి కానీ అధికారులంతా ఆఫీస్కే పరిమితం అవుతున్నారు. రైతులకు అవగాహన కల్పించడం అనేది తూతూ మంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. రైతులు పండించిన ధాన్యం, ఐకేపీ సెంటర్ల విషయంలో ఎన్నిసార్లు ఫోన్లు చేసినా సమాధానం ఇవ్వడం లేదని పలు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. వరి ధాన్యం కోత తర్వాత రైతులకు రైతు వేదిక ద్వారా అవగాహన కల్పించడం పోయి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో సరిపెట్టుకున్నారు. తూతూ మంత్రంగా వరి కోత తర్వాత వరి కొయ్యలు గడ్డిని కాల్చకుండా భూమిని రక్షించుకునే చర్యల గురించి సోషల్ మీడియాలలో మెసేజ్ పెట్టడంతో చేతులు దులుపుకున్నారు.

ప్రభుత్వాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు ఈ దేశానికి రైతే రాజు రైతే వెన్నెముక అని మాటల్లో అనడం తప్పితే చేతల్లో మాత్రం క్షేత్రస్థాయిలో రైతు పడే కష్టాలను వ్యవసాయ శాఖ పట్టీపట్టనట్లు పట్టించుకోవడం లేదు అని కళ్లకు కనబడుతూనే ఉంది. అందుకు నిదర్శనమే సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ వ్యవసాయ శాఖ వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారుల సమయపాలన పాటించకపోవడం, అలసత్వం, అలాగే క్షేత్రస్థాయిలో రైతుల పంట సమస్యల గురించి ఎన్నిసార్లు ఫోన్ చేసి చెప్పిన ఫీల్డ్ విజిట్ కు రాకపోవడం, ఇకపోతే వ్యవసాయ అధికారి ఏవో నెలలో సగం రోజులు వచ్చి, మరో సగం రోజులు వచ్చిరానట్లు కాలయాపన చేయడం పరిపాటిగా మారింది. అలాగే వ్యవసాయ విస్తరణ అధికారులు ఈ సమయంలో వరి కోతల తర్వాత రైతులకు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కావాల్సిన సదుపాయాలను కల్పించడంలో అలసత్వం ప్రదర్శించడం, అలాగే వరి కోతల తర్వాత భూమి సస్యరక్షణ చర్యల విషయంలో ప్రత్యక్షంగా రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి తమ పని అయిపోయిందే అన్నట్లు ఆఫీసులకే పరిమితం కావడం విడ్డూరం.

ముఖ్య విషయం ఏమిటంటే వాట్సప్ సోషల్ మీడియాలలో పేపర్ ప్రకటనలో వరి కోత తర్వాత వరి కొయ్యలను, వరిగడ్డిని కాల్చకుండా భూమిని రక్షించుకునే చర్యలను గూర్చి టెక్నాలజీలో ప్రచురించడం ద్వారా రైతులకు ఏం లాభం, ఆ పోస్టులను ఏ రైతు అయినా చూస్తాడా అనేది ఆ వ్యవసాయ అధికారులకే తెలియాలి మరి. దౌల్తాబాద్ మండల వ్యవసాయ శాఖ అధికారి, విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించడం రైతుల సమస్యలను తెలుసుకోవడం అంతంత మాత్రమే అని మండల వ్యాప్తంగా రైతులందరూ వాపోతున్నారు. ఇప్పటికైనా ఆరుగాలం కష్టించి పని చేసే బువ్వ పండించే రైతన్నను రైతన్న కష్టాలను గ్రహించి తమ సమస్యలను ప్రత్యక్షంగా వచ్చి చూసి పరిష్కరించాలని అలాగే సమయపాలనలో అలసత్వం పనికిరాదని దీనివల్ల ఇతర గ్రామాల నుండి వచ్చే రైతులము తమ సమయాన్ని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Similar News