సీఎం ఇలాకాలో అక్రమాల బాగోతం

ఓ అమాయకురాలి పట్టా భూమిని కబ్జా చేయడానికి అధికార పార్టీ నాయకులు రెవెన్యూ అధికారుల అండదండలతో ఏకంగా ధరణి రికార్డులో ఆ మహిళా రైతు చనిపోయినట్లు రికార్డులు తారుమారు చేశారు.

Update: 2023-03-18 03:26 GMT

ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్​ నియోజకవర్గంలో భూ అక్రమాలు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజూ ఏదో ఒక చోట కబ్జా బాగోతం వెలుగులోకి వస్తున్నది. అధికార పార్టీ నేతలే రెవెన్యూ అధికారుల అండదండలతో ఆక్రమణలకు పాల్పడుతున్నారు. తాజాగా మనోహరాబాద్​ మండలం లింగారెడ్డిపేట గ్రామంలో ఓ మహిళ భూమిని అధికార పార్టీ నాయకుడు కాజేసేందుకు యత్నించాడు. గ్రామానికి చెందిన లలితకు సర్వే నంబర్​ 142/అ లో 28 గంటల భూమి ఉండగా ఆ భూమిని కాజేసేందుకు ఆమె చనిపోయినట్లుగా ధరణిలో నమోదు చేయించాడు. ఈ విషయం ఆ మహిళ అవసరాల కోసం భూమిని విక్రయించేందుకు స్లాట్​బుక్​ చేసుకోవడానికి మీ సేవ కేంద్రానికి వెళ్లగా అక్కడ వెలుగులోకి వచ్చింది. ఆమె రెవెన్యూ అధికారులను ప్రశ్నించడంతో ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనని ధరణిలో సరి చేశారు. ఈ విషయంపై ఆ మహిళా రైతు స్థానిక పోలీస్​ స్టేషన్​ లో ఫిర్యాదు చేసింది.

దిశ, తూప్రాన్/ మనోహరాబాద్: ఓ అమాయకురాలి పట్టా భూమిని కబ్జా చేయడానికి అధికార పార్టీ నాయకులు రెవెన్యూ అధికారుల అండదండలతో ఏకంగా ధరణి రికార్డులో ఆ మహిళా రైతు చనిపోయినట్లు రికార్డులు తారుమారు చేశారు. విషయం తెలుసుకున్న ఆ మహిళ రెవెన్యూ అధికారులను నిలదీయగా గురువారం వరకు ధరణి రికార్డులలో ఆ మహిళ చనిపోయినట్లు నమోదు ఉంది. ఉలిక్కిపడ్డ రెవెన్యూ అధికారులు రాత్రికి రాత్రే ధరణి రికార్డులలో ఆ మహిళ బతికున్నట్లు నమోదు చేసి శుక్రవారం రికార్డులకు ఎక్కించారు. ఇలా రెవెన్యూ అధికారుల మాయాజాలం వెలుగు చూసింది. సాక్షాత్తు సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజల్ నియోజకవర్గం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట గ్రామంలో జరిగింది.

మండలంలోని లింగారెడ్డి పేట గ్రామానికి చెందిన లలిత భర్త శంకర్ గౌడ్ కు గ్రామ శివారులో సర్వేనెంబర్ 142/అ లో 28 గుంటల పట్టా భూమిని అవసరాల నిమిత్తం అమ్ముకోవడానికి స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి గురువారం మీసేవకు వెళ్లగా స్లాట్ బుక్కు కాకపోవడంతో స్థానిక తహసీల్దార్ బిక్షపతి వద్దకు వెళ్లి వివరణ కోరగా పట్టాదారు శంకరయ్యల లలిత చనిపోయినట్లు నమోదయిందని సెలవిచ్చారు. దీని కాపీ సైతం ఆమెకు అందజేశారు. ఇది అన్యాయం అక్రమమని అధికారులను నిలదీసి ఈ తతంగం ఎవరు చేశారో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

కంగుతిన్న అధికారులు ఇదేదో తమ మెడకు పడుతుందని గుర్తించిన అధికారులు రాత్రికి రాత్రే ఆమె బతికున్నట్లు ఆమె పేరు పట్టా భూమి ఉన్నట్లు ధరణి రికార్డుల్లో సరిదిద్ది శుక్రవారం ఆన్లైన్ లో నమోదు చేశారు. ఇది గుర్తించిన లలిత శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ కుమారుడైన అధికార పార్టీ నాయకుడు శివగోని పెంట గౌడ్ పై అనుమానం వచ్చి ఇతరులతో అడిగించగా తానే చేసినట్లు ఒప్పుకున్నాడని ఆమె తెలిపారు. ఈ అక్రమానికి పాల్పడిన పోలీసులు పెంటా గౌడ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో లలిత పేర్కొంది.

త్రిపుర వెంచర్ కబ్జాను ప్రశ్నించినందుకే ఈ అక్రమం..

గ్రామ శివారులో ఏర్పాటు చేసిన త్రిపుర వెంచర్‌లొ పది ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారుల, ఈ నాయకుని అండదండలతో రియల్ వ్యాపారులు కబ్జా చేయగా తాము ప్రశ్నించినందుకే ఈ అఘాయిత్యానికి, అక్రమానికి పాల్పడ్డాడని లలిత కుమారుడు సురేష్, వారి మిత్రులు ఆరోపించారు.

తూప్రాన్ ఘటన మరువక ముందే పక్షం రోజుల్లో ఈ అక్రమం..

తూప్రాన్ మండలంలో ఇదే తీరుగా సంఘటన జరిగి పక్షం రోజులు గడవకముందే మనోహరాబాద్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మండలంలోని వెంకటాయపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య యాదవ్ చనిపోయినట్లు ధ్రువపత్రాలు సృష్టించి ఆయన వ్యవసాయ భూమిని మరొకరిపై దొంగ పట్టా రిజిస్ట్రేషన్ చేశారు. అధికారుల విచారణలో రెవెన్యూ ఇన్​ స్పెక్టర్​ నాగేశ్​ పాత్ర ఉన్నట్లు నివేదిక వెల్లడి కావడంతో అతనిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. ఈ సంఘటన జరిగి పక్షం రోజులు గడవకముందే మనోహరాబాద్ లో అధికార పార్టీ నాయకుడు, రెవెన్యూ అధికారుల బాగోతం బట్టబయలైంది.

Tags:    

Similar News