నేలకూలిన లక్ష్మీనర్సింహుడి కమాన్..పలువురికి గాయాలు
నాచారం శ్రీ లక్ష్మినర్సింహా స్వామి వారి దేవస్థానానికి హైదరాబాద్ కు చెందిన దాతలు, పోతరాజ్ పల్లి వద్ద సుమారు ఐదు దశాబ్దాల క్రితం దేవతామూర్తులతో కూడిన దేవస్థాన ముఖ ద్వార కమాన్ నిర్మింపజేశారు.
దిశ, తూప్రాన్: నాచారం శ్రీ లక్ష్మినర్సింహా స్వామి వారి దేవస్థానానికి హైదరాబాద్ కు చెందిన దాతలు, పోతరాజ్ పల్లి వద్ద సుమారు ఐదు దశాబ్దాల క్రితం దేవతామూర్తులతో కూడిన దేవస్థాన ముఖ ద్వార కమాన్ నిర్మింపజేశారు. కాలక్రమేణ భారీ వాహనాలు రాకపోకల వల్ల నిర్మాణం దెబ్బతిన్నదని, ఇటీవల నూతన కమాన్ నిర్మాణానికి దేవాలయ పాలకవర్గం తీర్మానం చేసింది. ఈ నిర్మాణానికి గతంలో నిర్మించిన దాతలే ముందుకు రావడంతో గత కొద్దీ రోజులుగా కమాన్ నిర్మాణం పనులు సాగుతున్నాయి.
నిర్మాణంలో భాగంగా ఆదివారం కమాన్ స్లాబ్ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా స్లాబ్ కూలిపోయింది. దీంతో పనులు నిర్వహిస్తున్న కార్మికులకు గాయాలయ్యాయి. వారిని తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కమాన్ కూలిపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. వచ్చే నెలలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరగనుండడం, ఈ సంఘటన చోటుచేసుకోవడం పట్ల భక్తులలో కలవరం మొదలయింది.