ఉపాధి కరువై..బతుకు భారమై..మల్లన్నసాగర్ నిర్వాసితుల వెతలు

మల్లన్న సాగర్ భూనిర్వాసితులు ఉపాధి లేక గజ్వేల్ ఆర్ అండ్ ఆర్

Update: 2024-11-20 02:02 GMT

దిశ, గజ్వేల్ రూరల్: మల్లన్న సాగర్ భూనిర్వాసితులు ఉపాధి లేక గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీలో అష్టకష్టాలు పడుతున్నారు. ఉపాధి కరువై బతుకు భారమే ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కొందరు ఇళ్ల నిర్మాణాలకు అప్పులు చేసి వాటిని ఎలా తీర్చాలో మార్గం లేక అయోమయానికి గురవుతున్నారు. కాగా ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురైన 14 గ్రామాల నిర్వాసితులకు ఉపాధి కల్పించడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పవచ్చు. నిర్వాసితులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోకి తరలించి వారికి జీవనోపాధిని కల్పించకపోవడంతో నిర్వాసితులు ఉపాధి లేక నానా అవస్థలు పడుతున్నారు.

పల్లె ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతానికి రావడంతో నిర్వాసితులు ప్రతి నిత్యావసర వస్తువును కొనుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. కుటుంబ ఖర్చులు కూడా పెరగడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకపక్క ఖర్చులు పెరగడం మరో పక్క ఉపాధి లేకపోవడంతో వారి కుటుంబ పోషణ భారం గా తయారైంది. కుటుంబ ఖర్చులు తీరాలంటే కొందరు అడ్డా మీది కూలీలుగా మారుతున్నారు. గజ్వేల్ లో ఉపాధి దొరకకపోవడంతో తక్కువ కూలి ఇచ్చినా సరే పంట పొలాల్లోకి పనికి వెళ్తున్నారు. మహిళలు అటు పంటచేన్లకు కూలికి పోతూ, ఇటు బీడీలు చుడుతూ బతుకు వెళ్లదీస్తున్నారు. అయినా వారి ఖర్చులకు ఏ మాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

14 గ్రామాలను ఒకే దగ్గర చేర్చి..

మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో ముంపునకు గురైన కొండపాక మండలంలోని సింగారం, ఎర్రవల్లి, తొగుట మండలంలోని రాంపూర్, బ్రాహ్మణబంజేరుపల్లి, లక్ష్మాపూర్, ఏటిగడ్డ కిష్టాపూర్, పల్లెపహాడ్, వేములఘాట్ గ్రామలతో పాటు వాటి మధిర గ్రామాలతో కలిపి 14 గ్రామాలను ఒకే దగ్గర చేర్చడంతో ఉపాధి దొరకడం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిర్వాసిత కుటుంబాలను ఒకే దగ్గర కాకుండా ఉపాధి అవకాశాలు ఉన్న ప్రాంతాలలో వేరు వేరుగా వేస్తే జీవనోపాధి దొరికే అవకాశం ఉంటుండే అంటూ పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలను నెలకొల్పి నిర్వాసితులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని నిర్వాసితులకు ఉపాధి లేకుండా చేసిందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిర్వాసితులకు ఉపాధి కల్పించడంలో ఫెయిలయ్యిందన్నారు.

ఉపాధి హామీ పథకం లేకపోవడం...

మల్లన్నసాగర్ భూ నిర్వాసితులు వారి గ్రామాలను కోల్పోయిన నాటి నుంచి మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద లభించే 100 రోజుల పని దినాలను సైతం కోల్పోవడంతో ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కాలనీల్లో చేయడానికి పనిలేక, ఇతర ఉపాధి మార్గం కానరాక నిర్వాసిత కుటుంబాలు సతమతమవుతున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్వాసితులకు పని దినాలను కల్పించాలని కోరుతున్నారు.

సబ్సిడీ రుణాలను అందివ్వాలి..

స్వయం ఉపాధిని పొందేవిధంగా నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం సబ్సిడీపై రుణాలను అందివ్వాలని కోరుతున్నారు. అలాగే ప్రభుత్వం ఉపాధి మార్గాలను అన్వేషించి యువకులకు ఉపాధి కల్పించాలని, సబ్సిడీపై వాహనాలను, ఇతర పనిముట్లను అందివ్వాలని కోరుతున్నారు. కంపెనీలను నెలకొల్పి అందులో భూనిర్వాసితులకు ఉద్యోగాలను కల్పించాలని కోరుతున్నారు.

ఉపాధి లేక వలస పోతున్న నిరుద్యోగులు..

గజ్వేల్ పట్టణంలో ఉపాధి లేకపోవడంతో గత 5 సంవత్సరాలుగా నిరుద్యోగ యువత ఏం చేయాలో అర్థం కాక ఖాళీగానే ఉంటున్నారు. పలువురు నిర్వాసితులు గజ్వేల్ పట్టణంలోని పలు దుకాణాల్లో పని చేస్తూ బతుకు వెళ్లదీస్తున్నారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడంతో మరికొందరు నిరుద్యోగ యువకులు హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి నగరాలకు ఉపాధి నిమిత్తం వలసవెళుతున్నారు. ఇప్పటికైనా మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం జీవనోపాధిని కల్పించాలని, అన్ని రకాలుగా న్యాయం చేయాలని కోరుకుందాం.


Similar News