కన్నుల పండుగగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం

కోరిన కోర్కెలు తీర్చే కోర మీసాల కొమురవెల్లి

Update: 2024-12-29 07:13 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి / కొమురవెల్లి : కోరిన కోర్కెలు తీర్చే కోర మీసాల కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన మల్లన్న కల్యాణం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. తోట బావి ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన కల్యాణ వేదికపై బలిజ మేడలాదేవి, యాదవుల ఆడ బిడ్డ అయిన కేతలాదేవిని మల్లన్న కల్యాణం చేసుకొగా, వధువుల తరపున మహాదేవుని వంశస్థులు కన్యాదానం చేయగా వరుడి తరపున పడిగన్నగారి వంశస్తులు కన్యాదానం స్వీకరించారు. వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం కాశీ పీఠాధిపతి శ్రీమద్ జ్ఞాన హాసనాధీశ్వర 1008 జగద్గురు మల్లికార్జున విశ్వరాధ్య శివాచార్య పర్యవేక్షణలో వేద పండితుల మంత్రోచ్ఛారణతో కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అర్చకులు సమర్పించారు. కల్యాణ మహోత్సవంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీసీ కమిషన్ మెంబర్ బాల లక్ష్మి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి హాజరు అయ్యారు. అంతకు ముందు ఉదయం ఆలయంలో దృష్టి కుంభము, ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన మల్లన్న కల్యాణం తిలకించడానికి భక్తులు, శివసత్తులు బారులు తీరారు. మల్లన్న శరణు అంటూ జయజయధ్వానాలతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగింది.


Similar News