ఫోన్ ట్యాపింగ్‌లో మొదటి ముద్దాయి కేసీఆర్ : రఘునందన్ రావు
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి నిందితుడు కేసీఆర్ అని బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, కంది : రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి నిందితుడు కేసీఆర్ అని బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కంది పరిధిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మొదటి బాధితుడు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉన్నతాధికారుల ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేయించారని రఘునందన్ రావు ఆరోపించారు. ఓటుకు నోటు కేసు వ్యవహారంలో అప్పుడే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఫోన్ ట్యాపింగ్ చేయించి జైలుకు పంపించారని అన్నారు. సొంత కూతురు పెళ్లికి పెరోల్ పై రావాల్సిన పరిస్థితిని తీసుకురావడం చాలా బాధాకరమన్నారు. ఈ వ్యవహారం మంతటికి అసలు సూత్రధారి అయిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఈ కేసులో ఏ1గా చేర్చాలన్నారు. అలాగే తాను దుబ్బాకలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా తన ఫోన్‌తో పాటు తన కుటుంబ సభ్యుల అందరి ఫోన్లు ట్యాపింగ్ ద్వారా విన్నారని ఆరోపించారు.
ఇందులో మాజీ మంత్రి హరీష్ రావు పాత్రతో పాటు అప్పటి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పాత్ర కూడా ఉందని మండిపడ్డారు. వారిని కూడా నిందితులుగా చేర్చాలని కోరారు. అసలైన నిందితులను పక్కనపెట్టి కొంతమంది అధికారులపైనే చర్యలు తీసుకుని చేతులు దులుపుకోవడం సరికాదని అన్నారు. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న అధికారులు అమెరికాకు వెళ్లిపోయినట్లే, కేసీఆర్‌తో పాటు మరికొందరు కూడా వెళ్లిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారాన్ని చీఫ్ జస్టిస్ కోర్టు ద్వారా కానీ, సీబీఐకి అప్పగించి అసలైన నిందితులకు శిక్ష పడేలా చూడాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
ప్రత్యేక విమానంలో సీఎంతో హరీష్ ఏం చర్చలు జరిపారు..?
ఢిల్లీ అధిష్టానం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మార్చి 19న పిలుపు వచ్చింది. వెంటనే రేవంత్ రెడ్డి A10389 బిజినెస్ క్లాస్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి రాత్రి 10.15 బయలుదేరారు. అదే విమానంలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా వెళ్లారు. రెండు గంటల ప్రయాణంలో హరీష్ రావు ముఖ్యమంత్రితో ఏం చర్చలు జరిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నుంచి తనను తప్పించాలని కోరారా, లేక తమ పార్టీ వారందరినీ కాంగ్రెస్లోకి తెచ్చేలా చూస్తానని సీఎంకు హామీ ఇచ్చారా అనే విషయాలు బహిర్గతం అవ్వాల్సిన అవసరం ఉందని రఘునందన్ రావు అన్నారు. అలాగే హరీష్ రావు తన బినామీల ద్వారా నడిపిస్తున్న ఐ న్యూస్ ఛానల్ పాత్ర కీలకంగా ఈ కేసులో ఉన్నందున ఎందుకు సదరు సంస్థపై చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు పులిమామిడి రాజు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొండాపురం జగన్, పట్టణ అధ్యక్షుడు ద్వారక రవి, మాజీ పట్టణ అధ్యక్షుడు రవి శంకర్ తదితరులు పాల్గొన్నారు.