రాజకీయాల కోసం కాదు ప్రజల కోసం పనిచేసే సీఎం.. కేసీఆర్ : మంత్రి హరీశ్ రావు
గజ్వేల్ అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచి దేశంలో రోల్ మోడల్ గా మారిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి... KCR Birthday at Gajwel
దిశ, ప్రజ్ఞాపూర్: గజ్వేల్ అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచి దేశంలో రోల్ మోడల్ గా మారిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. గజ్వేల్ దిశా దశ మార్చిన ప్రజా బాంధవులు కేసీఆర్ అన్నారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గజ్వేల్ లో జరిగిన పలు కార్యక్రమాల్లో మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుతో గజ్వేల్ కు తాగునీటి సమస్య శాశ్వతంగా తీరిందన్నారు. గజ్వేల్ లో విద్యా వైద్య రంగాలతోపాటు మౌలిక సదుపాయాలు కల్పనతో అభివృద్ధిలో పరుగులు తీస్తుందన్నారు.
గ్రీనరీ పెంచడం, అడవుల సంరక్షణ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, తెలంగాణలో హరిత విప్లవాన్ని ప్రారంభించి అడవులను పునరుద్ధరించడం జరిగిందన్నారు. గ్రామాల్లో పట్టణ పలు వీధుల్లో నర్సరీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రీన్ కవర్ భవిష్యత్ తరాలకు అవసరమని, మొక్కలు లేకపోతే మానవ మనుగడ లేదని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు మొక్కలు నాటడం, అడవుల సంరక్షణ బాధ్యతలు మరవడం వల్ల తెలంగాణ తీరని ఇబ్బందులకు గురైందన్నారు. భూలోక వైకుంఠంగా తలపించే విధంగా యాదాద్రిని నిర్మించారని, 12 లక్షల మంది పేదింటి ఆడపడుచులకు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ తో ఆర్థిక సాయం కేసీఆర్ అందించారన్నారు. పేదలకు 6 కిలోల బియ్యం ఉచితంగా అందిస్తున్నామన్నారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. దివ్యాంగులకు 3000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు.
ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
గజ్వేల్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రజలు ఆదరిస్తున్నారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ 69వ జన్మదిన సందర్భంగా గజ్వేల్ లో పండుగ వాతావరణ ఏర్పడిందని అన్నారు. 60 మంది దివ్యాంగులకు స్కూటీలను మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. రింగ్ రోడ్డుపై పెద్ద మొత్తంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ వద్ద మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శతక శిల్పాన్ని, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. స్టేడియంలో క్రీడా ఉత్సవాలను మంత్రి ప్రారంభించారు. ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ రోజా రాధాకృష్ణశర్మ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎఫ్ డీసీ చైర్మన్ ప్రతాపరెడ్డి, కమిషనర్ శ్వేత, గడ అధికారి ముత్యం రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ ఎన్ సీ రాజమౌళి లతోపాటు సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ ప్రెసిడెంట్లు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.