MP : ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేది జర్నలిజం

ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేది జర్నలిజమేనని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు.

Update: 2024-10-25 12:18 GMT

దిశ, మెదక్ ప్రతినిధి: ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేది జర్నలిజమేనని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. మెదక్ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో శుక్రవారం జర్నలిస్టులకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో "వర్తలప్" వర్క్ షాప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్తలప్ కార్యక్రమాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. జర్నలిస్టులు ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా వార్తలు ప్రచురించాలన్నారు. విలువలతో కూడిన జర్నలిజం సమాజానికి మేలు చేస్తుంది అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టులు ప్రముఖ పాత్ర వహిస్తున్నారని, జర్నలిస్టులు రాసే ప్రతి వార్త పేద వాళ్లకు ఉపయోగకరంగా ఉండేలా అట్టడుగు వర్గాల వారి అభ్యున్నతికి ఉపయోగపడాలని పిలుపునిచ్చారు.

గ్రామాల్లో ఏర్పడిన సంతల్లో, మండల కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణం జరగాలన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి మండల కేంద్రాలకు అవసరాల నిమిత్తం వచ్చే విద్యార్థినిలు, మహిళలకు మరుగుదొడ్లు లేక అవస్థలు పడుతున్నారని ఇలాంటి వాటిపై వార్తలు రాసి సమాజానికి జర్నలిస్టులు మేలు చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. జర్నలిజం చాలా పవిత్రమైందని, నిజమైన వార్తలు ప్రచురించాలని, సమాజంలో ఉన్న వివక్ష, మూఢనమ్మకాలు, సామాజిక బహిష్కరణ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా వార్తలు రాయాలని ప్రజలను చైతన్య పరచాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ మానస్ కృష్ణ కాంత్ ,శివ చరణ్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, డీపీఆర్వో రామచంద్ర రాజు, బాబురావు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


Similar News