‘డబ్బులిస్తే చాలు.. డాక్యుమెంట్లు రెడీ’.. అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డగా ‘జోగిపేట’
ఖాళీ జాగా ఉంటే చాలు.. ఎలాంటి అనుమతులు లేకున్నా పర్వాలేదు.
దిశ,అందోల్: ఖాళీ జాగా ఉంటే చాలు.. ఎలాంటి అనుమతులు లేకున్నా పర్వాలేదు. పైసలిస్తే చాలు ఏ స్థలాన్నైనా రిజిస్ట్రేషన్లు చేసేస్తారు. ప్రస్తుతం జోగిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అక్రమ రిజిస్ట్రేషన్లకు జోగిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అడ్డగా మారింది. జోగిపేట సబ్ రిజిస్టార్ పరిధిలోకి మున్సిపాలిటీతో సహా అందోలు, పుల్కల్, వట్‌పల్లి, చౌటకూర్, హత్నూర మండలాలు వస్తాయి. ఆయా మండలాల పరిధిలోని ప్లాట్‌లు, ఖాళీ స్థలాలు, ఇళ్ల క్రయవిక్రయాల్లో చేసే రిజిస్టేషన్లలో పెద్ద ఎత్తున అవకతవలకు పాల్పడుతూ, సబ్ రిజిస్ట్రార్ సిబ్బంది పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ల్యాండ్ రెగ్యులరైజేషన్ (ఎల్‌ఆర్‌ఎస్) ఉంటేనే రిజిస్టేషన్‌లు చేయాల్సి ఉండగా, అవేవి లేకుండా కేవలం ఆసిస్‌మెంట్ నంబర్‌తో అక్రమ రిజిస్ట్రేషన్‌లు చేస్తున్నారు. అసిస్‌మెంట్ నంబర్లు ఉన్న వాటిని కూడా రిజిస్టేషన్‌లు చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసిన కాసుల కక్కుర్తికి అలవాటు పడి యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లను చేస్తూ, అడ్డగోలుగా డబ్బులను దండుకుంటున్నారు. ఇప్పటికైనా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
పర్మిషన్ లేని ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు..
జోగిపేట సబ్ రిజిస్ట్రార్ పరిధిలోకి వచ్చే అందోలు మండలం పోసానిపేట, హత్నూర మండలం చింతలచెరువు, ఖానాపూర్, వట్‌పల్లి మండలం గొర్రెకల్ గ్రామాల శివారులో ఉన్న అనుమతి లేని ప్లాట్లలకు రిజిస్ట్రేషన్లు చేసి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. పోసానిపేట శివారులోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న భూమికి గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతి లేకున్నా, ప్లాట్లకు నంబర్లు సృష్టించి 30, 31, 32, 33 ప్లాట్లుగా వేసి గత నెల 13వ తేదీన 1132,1133,1134, 1135 డాక్యుమెంట్ నంబర్లతో అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారు.
అదే రోజున వట్‌పల్లి మండలం గొర్రెకల్ శివారులోని 1121,1122, 1123 డాక్యూమెంట్ నంబర్లతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. హెచ్‌ఎండీఏ పరిధిలోకి వచ్చే హత్నూర మండలం తుర్కల ఖానాపూర్ 1078 నుంచి 1085 వరకు 8 ప్లాట్‌లను, చింతలచెరువులో 1127ల డాక్యుమెంట్లపై రిజిస్ట్రేషన్‌లు చేశారు. పైన పెర్కోన్న డాక్యుమెంట్లకు పంచాయతీ నుంచి అనుమతులు, లింకు డాక్యుమెంట్లు, ఎల్‌ఆర్‌ఎస్‌లు లేకుండానే రిజిస్ట్రేషన్లు చేసి, పెద్ద మొత్తంలో డబ్బులను వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే జోగిపేట సబ్ రిజిస్టార్ కార్యాలయంపై ఉన్నతాధికారులు సమగ్రంగా దర్యాప్తు చేపడితే పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు బయటకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో జిల్లా సబ్‌రిజిస్ట్రార్ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
కొన్నారు సరే.. నిర్మాణ అనుమతులు ఎలా?
ప్రభుత్వ అనుమతులు లేకుండా చేసుకున్న రిజిస్ట్రేషన్‌ల స్థలాల్లో నిర్మాణ పనులకు పంచాయతీ అధికారులు అనుమతులు ఎలా ఇస్తారన్నది కొనుగోలు దారుల్లో కొత్త సందేహం నెలకొంది. గ్రామ పంచాయతీ అనుమతులు పొందని లే అవుట్‌లకు అనుమతులు ఇవ్వడం కుదరదని పంచాయతీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్ లేని ప్లాట్‌లను కేవలం అసిస్‌మెంట్ నంబర్‌తో రిజిస్టేషన్‌లు చట్టవిరుద్దమే, కానీ ఆ స్థలాల్లో నిర్మాణానికి అనుమతులు మాత్రం రావడం కష్టమేనని చెబుతున్నారు. ప్లాట్‌లు కొనుగోలు చే సేవారు మాత్రం అప్రమత్తంగా ఉండాలని, ఎల్‌ఆర్‌ఎస్, పంచాయతీ అనుమతి ఉన్న వాటిని కొనుగోలు చేసుకోవాలని వారు సూచిస్తున్నారు.
అన్ని డాక్యుమెంట్‌లు ఉన్నా.. పైసలు ఇవ్వాల్సిందే
రిజిస్టేషన్‌కు అవసరమైన అన్ని డాక్యుమెంట్‌లు ఉన్నప్పటికీ పైసలిస్తే కానీ ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని జోగిపేట సబ్ రిజిస్టార్ కార్యాలయం వారు ముఖం ముందే చెప్పేస్తున్నారు. స్థలం, ఇళ్ల విస్తీర్ణ స్థాయిని బట్టి డబ్బుల వసూళ్లను చేపడుతున్నారు. ఒక్కొక్క ఇంటికి సుమారు రూ.15 నుంచి రూ.20 వేలు ఇస్తేనే రిజిస్ట్రేషన్‌లు చేస్తున్నారు. డాక్యుమెంట్‌లు ఉన్నా ఎందుకు పైసలివ్వాలని ప్రశ్నించిన వారి ఫైలు ముందుకు కదలకుండా ఎవో సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. రిజిస్ట్రేషన్ తప్పనిసరి కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అన్ని డాక్యుమెంట్‌లు ఉన్నా, పైసలివ్వక తప్పడం లేదని ఇళ్ల స్థలాల యజమానులు చెబుతున్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.