ఎక్స్‌పర్ట్‌ల పనేనా.. ఈ దొంగతనాలకు స్థానికులు ఎవరైనా సహకరించారా..?

సరిగ్గా మూడు నెలల క్రితం, హైవేను ఆనుకొని ఉన్న గ్రామాల్లో కట్టర్లు,

Update: 2025-03-29 07:45 GMT
ఎక్స్‌పర్ట్‌ల  పనేనా.. ఈ దొంగతనాలకు స్థానికులు ఎవరైనా సహకరించారా..?
  • whatsapp icon

 దిశ,భిక్కనూరు : సరిగ్గా మూడు నెలల క్రితం, హైవేను ఆనుకొని ఉన్న గ్రామాల్లో కట్టర్లు, ఇనుప రాడ్లతో సంచరించి హల్ చల్ చేసిన ఎక్స్ పర్ట్ ల గ్యాంగే, ఈ దొంగతనాలకు పాల్పడి ఉండొచ్చన్న అనుమానాన్ని, అటు పోలీసులు, ఇటు భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. అయితే బస్వాపూర్ గ్రామంలో ని సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఫుటేజ్ ను మరుసటి రోజు అప్పట్లో పరిశీలించగా ఆ గ్యాంగ్ సంచరించినట్లు గ్రామస్తులు, పోలీసులు గుర్తించారు. అదే రోజు హైవే పక్కన ఉన్న సిద్ధ రామేశ్వర నగర్ గ్రామంలో ఒక ఇంట్లో దొంగతనానికి పాల్పడి మూడు లక్షల రూపాయల సొత్తును దోచుకుపోయారు. ఇక్కడ సంచరించిన గ్యాంగే అక్కడ దొంగతనానికి పాల్పడి ఉండవచ్చని అప్పట్లో పోలీసులు భావించారు. దొంగతనాలు జరగకుండా రాత్రివేళ పెట్రోలింగ్ ముమ్మరం చేయడం తోపాటు, గస్తీ బీట్లను పెంచారు.

మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఒకే రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత తొమ్మిది ఇండ్లలో చొరబడి, పెద్దగా శబ్దం రాకుండా, ఇండ్లకు వేసిన తాళాలను వెంట తెచ్చుకున్న కట్టర్లతో కత్తిరించి లోపలికి ప్రవేశించారు. బీరువాలను తాళం చెవిలతో తెరిచి అందినకాడికి దోచుకున్నారు. ఈ విధంగా చోరీ జరగడానికి స్థానికులు సహకరించి ఉంటారని, బాధితులతో పాటు, గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సహకారంతోనే గ్యాంగ్ ఇక్కడికి వచ్చి ఉండొచ్చని గ్రామస్తులు ముచ్చటించుకోవడం కనిపించింది. పైగా ఈ మధ్యకాలంలో ఇండ్ల వద్దకే వచ్చి నిత్యవసర సరుకులు, తోసులు, ముంబై కారీలు, ప్లాస్టిక్ వస్తువులు, తాళాలు అంటూ వస్తువులను అమ్మేందుకు వచ్చేవారి పని అయి కూడా ఉండొచ్చని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం జరిగిన దొంగతనాలను ఛాలెంజ్ గా తీసుకొని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను పంపినట్లు తెలుస్తోంది.

తాజాగా బాగిర్తి పల్లిలో...

మండలంలోని బాగిర్తి పల్లి గ్రామంలో తాజాగా శనివారం మరో దొంగతనం జరిగింది. గ్రామానికి చెందిన మల్లు గారి లక్ష్మి ఇంట్లో, వేకువ జామున చొరబడిరూ. లక్ష 48 వేల నగదు, 17 తులాల విలువ చేసే వెండి వస్తువులను అపహరించుకుపోయారు.

గతంలోనూ ఇలాంటి సంఘటనలు..

మండల కేంద్రమైన భిక్కనూరు తో పాటు, బస్వాపూర్, భాగిర్తి పల్లి, సిద్ధ రామేశ్వర నగర్,జంగంపల్లి, పెద్ద మల్లారెడ్డి,తదితర గ్రామాల్లో ఇలాంటి సంఘటనలే గతంలోనూ చోటు చేసుకున్నాయి. బస్వాపూర్ గ్రామంలో మారణాయుధాలు, పెద్ద పెద్ద కట్టర్లతో గ్రామాల్లోకి వచ్చి దుండగులు చోరీలకు పాల్పడ్డారు. సిద్ధ రామేశ్వర నగర్ గ్రామంలోనూ గతంలో తాళం వేసిన ఇళ్లలో చోరీకి పాల్పడి బంగారు ఆభరణాలు నగదును ఎత్తుకెళ్లారు. మండలంలోని పలు గ్రామాల్లో సైతం ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోగా ఇప్పటి వరకు దీంట్లో కొన్ని కేసులు పరిష్కారానికి నోచుకోలేక పోయాయి.

సవాల్ గా మారిన దొంగతనాలు...

జరుగుతున్న దొంగతనాలు పోలీసులకు సవాల్ గా మారాయి. రాత్రివేళ హైవే పెట్రోలింగ్, పెట్రో కార్లతో ముమ్మరంగా గస్తీ తిరుగుతున్నప్పటికీ ఏదో ఒక చోట దొంగతనాలు జరుగుతుండడం, పోలీసులకు కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయి.

Similar News