భారీ వర్షాల నేపథ్యంలో అంతటా అప్రమత్తంగా ఉండాలి..

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అంతటా అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి సూచించారు.

Update: 2024-09-01 14:59 GMT

దిశ, సంగారెడ్డి : రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అంతటా అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి సూచించారు. ఆదివారం డీజీపీ డాక్టర్ జితేందర్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్ లు, ఎస్పీలతో వరద ప్రభావిత పరిస్థితులను సమీక్షించారు. ఒక్కో జిల్లా వారీగా ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ, చేపడుతున్న సహాయక చర్యల గురించి ఆరా తీశారు. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ఎక్కడ కూడా ప్రాణనష్టం సంభవించకుండా, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

భారీ వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టేంతవరకు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడైనా ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకుంటే తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని, అవసరమైన పక్షంలో రాష్ట్రం నుండి సహాయక బృందాలు పంపిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 26 ప్లాటూన్ల పోలీస్ బలగాలు అందుబాటులో ఉన్నాయని సూచించారు. చేపల వేటకు, ఈత సరదా కోసం చెరువులు, కుంటలు, రిజర్వాయర్ల వద్దకు ఎవరూ వెళ్లకుండా పోలీస్, రెవెన్యూ సిబ్బందిచే నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. కలెక్టర్ క్రాంతి వల్లూరు..

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆస్తి ప్రాణనష్టాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న ఎడతెరిపియ్యని వర్షాల కారణంగా ప్రమాదాలు జరగకుండా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు పడే ప్రజల కోసం జిల్లా స్థాయిలో సంగారెడ్డి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కంట్రోల్ రూమ్ నెంబర్ 08455 276155కు ప్రజల నుండి వచ్చిన ప్రతి ఫోన్ కాల్ కు సత్వరమే అధికారులు స్పందించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వర్షాల కారణంగా చెరువులు కుంటల్లోకి భారీ వరద నీరు వచ్చే అవకాశం ఉన్నందున ఎక్కడైనా కట్టలు తెగే అవకాశం ఉంటే వెంటనే వాటిని నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి అవసరమైన మరమత్తు చర్యలు చేపట్టాలన్నారు. కర్ణాటక మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నందున మంజీర తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. శిథిలావస్థకు చేరిన ఇండ్లు కార్యాలయాలను వెంటనే ఖాళీ చేయించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రూపేష్ అదనపు కలెక్టర్ లు చంద్రశేఖర్ రావు, మాధురి నీటిపారుదల శాఖ ఎస్ఈ యేసయ్య, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


Similar News