పని కావాలంటే పక్క ఎక్కాల్సిందే…

ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు అందుబాటులోకి తెచ్చిన మహిళలపై వేధింపులు మాత్రం ఆగడం లేదు.

Update: 2024-03-26 12:02 GMT

దిశ, ఆందోల్: ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు అందుబాటులోకి తెచ్చిన మహిళలపై వేధింపులు మాత్రం ఆగడం లేదు. అన్ని రంగాల్లో ధీటుగా రాణిస్తున్న మహిళలకు తోటి ఉద్యోగుల నుంచే లైంగిక వేధింపులు అధికమవుతున్నాయి. భావి భారత పౌరులని తయారు చేసే విద్యాలయాల్లో సైతం కొందరు కీచక అధ్యాపకులు లైంగికంగా వేధిస్తున్నారు. ఇలాంటి అమానుష ఘటన ఆందోల్ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో చోటు చేసుకుంది. కలశాలలో ఉద్యోగం చేయాలంటే తనకు పడక సుఖం అందించాలని లేదంటే ఉద్యోగానికి రాజీనామా చేయాలని ప్రిన్సిపాల్ వేధిస్తున్నాడని ఔట్ సోర్సింగ్ మహిళ ఉద్యోగి జోగిపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం మహిళ ఉద్యోగి ఆందోల్ మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ లైంగికంగా వేధిస్తూ లోబర్చుకోవాలని చూస్తున్నాడని సంచలన ఆరోపణలు చేసింది.

మీడియాకు అందిన వివరాల ప్రకారం 2015 సంవత్సరం నుంచి మహిళ ఉద్యోగి ఆందోల్ పాలిటెక్నిక్ మహిళ కళాశాలలో ఔట్ సోర్సింగ్ కింద జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తుంది. అయితే 2018లో శ్రీనివాసులు అనే సీనియర్ లెక్చరర్‌గా వచ్చినప్పటి నుంచి తనను లైంగికంగా వేధిస్తున్నాడని సంచలన ఆరోపణలు చేసింది. 2020లో శ్రీనివాసులు ప్రిన్సిపాల్‌కు పదోన్నతి పొందినప్పటి నుంచి వేధింపులు అధికామయ్యాయని బాధిత ఉద్యోగి మీడియా ఎదుట వాపోయింది. సదరు ప్రిన్సిపాల్‌కు తోటి ఉద్యోగులు సహకరించడంతో మరింత రెచ్చిపోయి తనను తీవ్రంగా లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించింది. తాను లొంగకపోయే సరికి నా విధుల విషయంలో అనవసర తప్పిదాలు వెతికి ఉద్యోగానికి రాజీనామా చేయాలని బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపింది. గతంలో సస్పెండ్ అయిన జూనియర్ అసిస్టెంట్ వర్క్‌కు సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా లెటర్ రాసి వివరణ ఇవ్వాలని బ్లాక్ మెయిలింగ్ చేస్తూ తనను లోబరుచుకోవడానికి యత్నిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.

చాలా రోజుల నుంచి ఈ వేధింపులు జరుగుతున్న మారుతాడని వేచి చూశానని తనను వేధించవద్దని ప్రాధేయపడ్డానని అయిన మారకపోగా వేధింపులను మరింతగా అధికం చేయడంతో పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశానని పేర్కొంది. ఆ ప్రిన్సిపాల్ మొదటి నుంచి ఉద్యోగినీలతో పాటు విద్యార్థినిలపై కూడా క్రూరంగా ప్రవర్తిస్తాడాని, మార్కుల విషయంలో సైతం బెదిరింపులకు దిగుతాడని విమర్శించింది. ఈ వ్యవహారంలో పోలీసులు కలుగజేసుకుని పూర్తి దర్యాప్తు జరిపి కీచక ప్రిన్సిపాల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది.

నేను ఎలాంటి తప్పు చేయలేదు : ప్రిన్సిపాల్ శ్రీనివాసులు

మహిళా ఉద్యోగిని పట్ల తాను ఎలాంటి తప్పు చేయలేదని ప్రిన్సిపాల్ శ్రీనివాస్ స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఆమె చేస్తున్న ఆరోపణలన్ని అవాస్తవమని ఆయన అన్నారు. తాను తప్పు చేసి ఉంటే డిపార్ట్మెంట్ వారు ఎలాంటి చర్యలు తీసుకున్న తాను అంగీకరిస్తానని ఆయన తెలిపారు. ఔట్ సోర్సింగ్ వారిని ఉద్యోగం నుంచి తీసివేస్తారనే అభద్రతాభావంతోనే ఆమె ఇలాంటి చర్యలకు పూనుకుందని ఆయన స్పష్టం చేశారు. వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన తెలిపారు.

డీఎస్పీ వద్దకు తీసుకు వెళ్లిన పోలీసులు…

ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, బాధితురాలును వేరువేరుగా సంగారెడ్డి డీఎస్పీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఉదయం ప్రిన్సిపాల్ పై ఫిర్యాదు చేసిన బాధితురాలు ఈ విషయాన్ని స్థానిక ఎస్సై అరుణ్ కుమార్ గౌడ్ డీఎస్పీ సత్తయ్య దృష్టికి తీసుకెళ్లడంతో వారిద్దరిని సంగారెడ్డికి తీసుకురావాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో వారిద్దరిని సంగారెడ్డికి తీసుకెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం.


Similar News