కబ్జాలను అడ్డుకుంటే.. నాపైనే ఆరోపణలు చేస్తారా..?
పటాన్ చెరు పట్టణంలో కళ్లెదుటే చెరువులు, నాలాలు, వరద కాలువలు పెద్ద ఎత్తున కబ్జాకు గురవుతున్నాయి.
దిశ పటాన్ చెరు: పటాన్ చెరు పట్టణంలో కళ్లెదుటే చెరువులు, నాలాలు, వరద కాలువలు పెద్ద ఎత్తున కబ్జాకు గురవుతున్నాయని, వీటిని పరిరక్షించకపోతే ప్రకృతి విపత్తుల సమయంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. డివిజన్ పరిధిలో జరుగుతున్న చెరువుల కబ్జాలపై ఆదివారం పటాన్ చెరులోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్ చెరు డివిజన్ పరిధిలో కొత్తగా వెలుస్తున్న వెంచర్ చుట్టుపక్కల ఉన్న వరద కాలువలు, నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారని, ఈ కబ్జాలకు పరోక్షంగా కొందరు లీడర్లు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. తాను కార్పొరేటర్ గా ఎన్నికైన నాటి నుండి ప్రజలకు మంచి చేయాలన్నా సంకల్పంతో కబ్జాలకు వ్యతిరేకంగా ధర్మ పోరాటం చేస్తున్నానన్నారు. కొందరు కబ్జాకోరులు కాలువలను మాయం చెయ్యడంతో చాలా కాలనీలు ముంపుకు గురై మునుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కాలువలను పునరద్ధరించి ప్రజలకు ముంపు సమస్య తీర్చడానికి గతంలో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో సైతం ప్రస్తావించినట్లు వెల్లడించారు.
కబ్జాలపై అధికారులకు ఫిర్యాదు లేఖలను సైతం రాశామన్నారు. కబ్జాలపై సీసీపీ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జాయింట్ సర్వే నిర్వహించి రాంకీ, రెయిన్బో, ఇంకార్, సీతారామ పురంలో కాలువలు కబ్జా అయ్యాయని తేల్చారని అన్నారు. పటాన్ చెరు పట్టణంలో 67 ఎకరాలలో సీతారామ పురం వెంచర్ ఉందన్నారు. ఆ వెంచర్ లో ఎటువంటి నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిగా రోడ్లను సైతం కబ్జా చేయడంతో పాటు పక్కన ఉన్న బఫర్ జోన్ ని కబ్జా చేసి ప్రహరీ గోడను నిర్మించారని తెలిపారు. ఆ ప్రహరీ గోడ చుట్టూ సుమారు 3 ఎకరాలకు పైగా భూమిని ఆక్రమించి బఫర్ జోన్ లో ప్లాట్లను అమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఇరిగేషన్ అధికారులు సైతం బఫర్ జోన్ కబ్జా విషయాన్ని గుర్తించి ప్రహరీ గోడను తొలగించడానికి సిబ్బందితో ఆ ప్రాంతానికి వెళ్లారని అన్నారు. అయితే కొన్ని రాజకీయ శక్తుల ఒత్తిళ్ల తో అధికారులు చర్యలు తీసుకోకుండా తిరిగి వచ్చారని తెలిపారు. ఆ కాలనీ కి కనీసం పార్కు స్థలాలు సైతం లేవని ఈ పర్మినెంట్ ప్రహరినీ తొలిగించడం ద్వారా నాలుగు ఎకరాలలో ఆట స్థలాలు, పార్కులు, వాకింగ్ ట్రాక్ నిర్మించుకోవడానికి అనుకూలంగా ఉండేదన్నారు. అయితే కొన్ని శక్తులు అధికారులను అడ్డుకుని మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
సీతారాంపురం వెంచర్ కు తాను కార్పొరేటర్ అయ్యాక మౌలిక వసతుల కల్పనలో భాగంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బట్టర్ ఫ్లై లైట్లు ఏర్పాటు చేసి కాలనీని అభివృద్ధి చేశానన్నారు. కళ్లముందు కబ్జాలను తానూ సహించనని, నీటి వనరులు ఆగం అయితే భవిష్యత్తులో ముంపు కు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అధికారులు ఇప్పటికైనా మేల్కొని ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా కబ్జాదారుల భరతం పట్టాలని విజ్ఞప్తి చేశారు. కబ్జాల భాగోతం పై కార్పొరేటర్ మెట్టు కుమార్ ఆరోపణలు చెయ్యడం అధికార పార్టీ లో సంచలనమైంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి బఫర్ జోన్ నిర్మాణాలను తొలగిస్తారేమో వేచిచూద్దాం..