ప్రభుత్వం పట్టాలిచ్చిన పేదల ఇండ్లు ఎలా కూల్చేస్తారు : నీలం

ఎన్నో ఏండ్ల నుంచి నివాసం ఉంటున్న తమ ఇండ్లను కొందరు అన్యాయంగా కూల్చివేశారని బాధితులు గొల్లుమంటున్నారు.

Update: 2023-11-20 15:14 GMT

దిశ, పటాన్ చెరు: ఎన్నో ఏండ్ల నుంచి నివాసం ఉంటున్న తమ ఇండ్లను కొందరు అన్యాయంగా కూల్చివేశారని బాధితులు గొల్లుమంటున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో ఇందిరమ్మ కాలనీ గుట్ట మీద సర్వే నెంబర్ 496లో 2007 సంవత్సరం నుంచి ఇండ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నామని తెలిపారు. ఈ ఇండ్లకు ప్రభుత్వం పట్టాలు సైతం మంజూరు చేసిందని భాదితులు వెల్లడించారు. పట్టాలు పొంది ఇండ్లు కట్టుకున్న తమ పై కొందరు దౌర్జన్యంగా దాడి చేసి అన్యాయంగా మా ఇండ్లను కూల్చేశారని బాధితులు వాపోతున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నామని కనికరించమని ప్రాధేయపడిన వినకుండా దౌర్జన్యంగా బెదిరించి భయబ్రాంతులకు గురిచేసి మా ఇండ్లను కూల్చివేశారని సర్వం కోల్పోయిన మేము ఎక్కడ నివసించాలని విలపిస్తున్నారు. అయితే ఇండ్ల కూల్చివేతను తెలుసుకున్న పటాన్ చెరు బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ఘటన స్థలానికి చేరుకొని బాధితులను ఓదార్చారు.

కనీసం ముందస్తు హెచ్చరిక లేకుండా ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసిన భూముల్లో కూల్చివేతలు చేయడం చట్టాన్ని అతిక్రమించడమేనన్నారు. హఠాత్తుగా పేదోళ్ల ఇండ్లు కూల్చివేస్తే వారెక్కడ నివసించాలని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో దౌర్జన్యంగా ఇండ్లు కూల్చివేసిన సదరు వ్యక్తులపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే అధికారులు ఇండ్లు కోల్పోయిన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన పై త్వరలో బీఎస్పీ పార్టీ తరఫున కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. ఇండ్లు కోల్పోయిన బాధితులు ఎవరు అధైర్య పడవద్దని ప్రతి ఒక్కరికి బీఎస్పీ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ప్రతి ఒక్కరికి ఇండ్ల పట్టాలను రెగ్యులరైజ్ చేయడంతో పాటు పక్కా గృహాలు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News