ఆయిల్ ఫామ్ తో అధిక లాభాలు : కలెక్టర్
జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుకు అవకాశాలు చాలా ఉన్నాయని రైతులను ఒప్పించి ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని
దిశ, సిద్దిపేట ప్రతినిధి : జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుకు అవకాశాలు చాలా ఉన్నాయని రైతులను ఒప్పించి ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి వ్యవసాయ, హార్టికల్చర్, ఆయిల్ ఫెడ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుపై అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...ఆయిల్ ఫామ్ సాగుతో రైతులు కంటిన్యూగా అధిక ఆదాయం పొందడమే కాకుండా అంతర పంటల ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని అన్నారు. నంగునూరు మండలం నర్మెట్టలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం కూడా వేగంగా జరుగుతున్నందున రైతులకు మార్కెటింగ్ సౌకర్యం కూడా సులభం అవుతుందని అన్నారు.
రైతులతో సమావేశాలు నిర్వహించి ఫామ్ ఆయిల్ పంటలు వేయడం ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించి రైతు పామ్ ఆయిల్ పంటలు వేసేలా ప్రోత్సహించాలని అన్నారు. వ్యవసాయ క్లస్టర్ల వారిగా ఇచ్చిన టార్గెట్ కు అనుగుణంగా ఆయిల్ ఫామ్ మొక్కలను నాటించాలని లక్ష్యం చేరడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రైతులతో ఆయిల్ ఫామ్ తోటలలోకి ఎక్స్ ప్లోజర్ విజిట్ చేయాలన్నారు. అదే విధంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ అధికారులు రెగ్యులర్ గా విజిట్ చేసి సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే దొడ్డు, సన్నని ధాన్యాన్ని గుర్తించడంలో కేంద్రంలో నిర్వాహకులకు సలహాలు ఇవ్వాలని అన్నారు. అనంతరం జిల్లా నీరు, పారిశుధ్య మిషన్ కమిటీ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి డిసెంబర్ 10 తేది వరకు వాటర్ అండ్ శానిటేషన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలి
పోషణ్ అభియాన్ కార్యక్రమం ద్వారా బాలలకు, గర్భిణీ స్త్రీలకు అవసరమైన అదనపు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అన్నారు. కలెక్టరేట్ లో డిస్టిక్ న్యూట్రిషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...తల్లి పాలు శ్రేష్టమైనవని చిన్నారులకు తల్లి పాలను పట్టాలని అన్నారు. 6 నుంచి 59 నెలల పిల్లలలో రక్తహీనత లోపం రాకుండా ఐరన్, పోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ వేయాలని అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలలో రెసిడెన్షియల్ స్కూలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్ అన్నింట్లో న్యూట్రి గార్డెన్స్ ఏర్పాటుచేసి ఆకుకూరలు, మునగా, కరివేపాకు, ఔషధ మొక్కలు పండించి విద్యార్థులకు భోజనంలో అందించాలని అన్నారు. విద్యా సంస్థలలో పిల్లల ఎదుగుదలను ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు పరిశీలించి ఏమైనా అనారోగ్య సమస్యలు కనబడితే ఆర్ బి ఎస్ కే బృందాలకు సమాచారం అందించి వైద్య సేవలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.