రైతుల వ(అ)రి గోస

గత సెప్టెంబర్ లో కురిసిన భారీ వర్షాలకు డోర్నకల్,సీరోలు మండల రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే.

Update: 2024-11-20 13:11 GMT

దిశ,డోర్నకల్ : గత సెప్టెంబర్ లో కురిసిన భారీ వర్షాలకు డోర్నకల్,సీరోలు మండల రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. వాగులు,వంకలు,ఏరులు నదులను తలపించాయి. చెరువులు, వంతెనలు, దారులు తెగిపోయి కకావికలమయ్యాయి. రైతులు ధ్వంసమైన పంటలు తొలగించి తిరిగి పంట సాగు చేశారు. అయినా రైతులకు గోసలు తప్పటం లేదు. వ్యవసాయ క్షేత్రాలకు దారి లేక అరిగోస పడుతున్నారు. ఎమ్మెల్యే రామచంద్రనాయక్ చొరవతో యుద్ధ ప్రాతిపదికన కొన్ని ప్రాంతాల్లో రోడ్ల పునరుద్ధరణ జరిపారు. సిరోలు మండల పరిధి మోదుగడ్డ తండా గిరిజన రైతులు ఆకేరు వరదలకు పంట పొలాలకు దారులు తెగిపోయి నరకయాతన అనుభవిస్తున్నారు. ఆకేరు వాగు అవతల దాదాపు 100 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. వరి పంట కోత మిషన్లు వెళ్లాలన్న, ధాన్యం ఇంటికి తీసుకురావాలన్న కష్టాలు, ఖర్చు తప్పడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం, ఆ ప్రాంత రైతులకు శాపంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పంట తరలింపుకు పదుల కిలోమీటర్లు.. వేల ఖర్చు..

మోదుగడ్డతండా గిరిజన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వానాకాలం వరదలతో గిరిజన తండా దారులు దెబ్బతిన్నాయి. మూడు నెలలైనా పంట పొలాల దారులు మరమ్మతులు జరగ లేదు. గిరిజనులే తాత్కాలిక రోడ్డు పనులు జరిపి వ్యవసాయ క్షేత్రాలకు రాకపోకలు జరుపుతున్నారు. ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలు వెళ్ళుటకు వీలుగా లేకపోవడం సమస్యగా మారింది. తండాకు సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న పంట పొలాలకు దారి సక్రమంగా లేకపోవడం తో దాదాపు 50 కిలోమీటర్లు తిరిగి వెళ్ళవలసిన పరిస్థితి. దీంతో రవాణా ఖర్చులు అధికమవుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి గిరిజన రైతులకు డొంక దారి కల్పించాల్సిన అవసరం ఉంది.

పొలాలకు దారి వేయాలి

పంట భూములకు వెళ్లేందుకు సక్రమంగా దారి లేదు. పంటలు తరలించడానికి, కోత యంత్రాలు వెళ్ళుటకు వీలు లేకపోవడం తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. కిలోమీటరు దూరానికి దాదాపు 50 కిలోమీటర్లు తిరిగి రావలసి వస్తుంది. దీంతో గంటల తరబడి సమయం,కష్టార్జితం కిరాయిలకు సరిపోతుంది.అధికారులు దారికి మరమ్మతులు జరిపి ఆదుకోవాలి.

మహిళా రైతు బానోతు రామ్కు

రైతుకు నష్టం..

రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఇంటికి తెచ్చుకోలేని పరిస్థితి దాపరించింది.గత మూడు నెలల క్రితం వచ్చిన వరదలకు దారి కొట్టుకుపోయి ట్రాక్టర్లు వెళ్ళుటకు ఇబ్బందిగా మారింది. నాటి నుంచి ఏ ఒక్క అధికారి పరిశీలించలేదు. మరమ్మతులు చేయించలేదు. తండా సమీప పొలాల పంటను కిలోమీటర్ల కొద్ది పక్క జిల్లా సరిహద్దు నుంచి తిరిగి వస్తున్నారు. దీంతో కిరాయి పది రెట్లు అధికమవుతుంది. అసలే వరదలకు పంటలు దెబ్బతిని,పెట్టుబడి అధికమై రైతులు అప్పుల పాలవుతున్నారు. దీనికి తోడు అధిక కిరాయిలు ఇచ్చుకోలేని పేద రైతులు పొలాల వద్ద దళారులకు తక్కువ ధరకు అమ్ముకొని ఆర్థికంగా చితికి పోతున్నారు. గిరిజన రైతుల అవసరాలను దృష్ట్యా దారి మరమ్మతులు జరిపించాలి.

రైతు గుగులోత్ వీరన్న

నష్టపోతున్నాం.. ఆదుకోండి..

భారీ వర్షాలకు పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయాం. అరకోర పండించిన పంటను తెచ్చుటకు దారి సక్రమంగా లేకపోవడంతో అధిక మొత్తంలో కష్టార్జితం ఖర్చుపెట్టి వాహనాల ద్వారా పంట తరలింపు జరుపుతున్నాం. గ్రామానికి సమీపంలో ఉన్న పంట పొలాలకు వెళ్ళుటకు ఇబ్బందుల దృష్ట్యా బిస్రాజ్ పల్లి, తిరుమలాయపాలెం,ములకలపల్లి మీదుగా తిరిగి గ్రామానికి రావాల్సి వస్తుంది. దీంతో దాదాపు 50 కిలోమీటర్లు ప్రయాణించాలి.సమయం వృధా, ఖర్చు అధికం అవుతుంది.రైతుల కన్నీటి బాధలు గుర్తించి డొంకదారి బాగు చేయాలి.

రైతు గుగులోత్ మాణిక్య


Similar News