పంతం నెగ్గించుకున్న హరీష్ రావు

మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పంతం నెగ్గించుకున్నారు.

Update: 2024-09-05 10:11 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పంతం నెగ్గించుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కు లను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం లబ్దిదారులకు అందించక పోవడంపై హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు గురువారం లబ్దిదారులకు వాటిని పంపిణీ చేశారు. వివరాల్లోకి వెళ్లితే...గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిద్దిపేట నియోజక వర్గానికి 474 కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలకు సంబంధించి అప్పటి ప్రభుత్వం చెక్కులను మంజూరు చేసింది. ఎన్నికల కోడ్ తదితర కారణాల నేపథ్యంలో ఆ సమయంలో లబ్దిదారులకు సంబంధిత చెక్ లు అధికారులు పంపిణీ చేయలేదు.

    అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం లబ్దిదారులకు సంబంధిత చెక్ లు పంపిణీ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశంతో ప్రక్రియను అడ్డుకుంటుందని, గడువు దాటితే లబ్దిదారులు నష్టపోయే అవకాశం ఉందని ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో వాదనలు విన్న న్యాయ మూర్తి సిద్దిపేట నియోజక వర్గానికి సంబంధించిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్ లను లబ్దిదారులకు అందించాలని అధికారులను ఆదేశించారు.

    ఈమేరకు గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు చిన్నకోడూరు మండలానికి సంబంధించి 20, నంగునూరు మండలానికి సంబంధించి 38, సిద్దిపేట అర్బన్ మండలానికి సంబంధించి 1, సిద్దిపేట రూరల్ మండలానికి సంబంధించి 19, నారాయణ రావు పేట మండలానికి సంబంధించి 391 మొత్తం 474 కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కు లను లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మీ పథకం కింద లక్ష రూపాయల తో పాటుగా తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడితే కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కోసం హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. 

Tags:    

Similar News