Harish Rao : ముదిరాజ్ రిజర్వేషన్‌కు సహకరిస్తాం
ముదిరాజ్ వర్గీకరణ విషయంలో, సమస్యల విషయంలో బీఆర్ఎస్ పార్టీ
దిశ, సిద్దిపేట ప్రతినిధి : ముదిరాజ్ వర్గీకరణ విషయంలో, సమస్యల విషయంలో బీఆర్ఎస్ పార్టీ సహకారం అందిస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రం కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ గారి విగ్రహాన్ని ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ముదిరాజ్ సంఘం ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ...హైదరాబాద్ తొలి మేయర్ గా కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ నగరానికి ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ అడుగుజాడల్లో ముదిరాజ్ సమాజం ముందుకు సాగాలన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముదిరాజ్ లకు సర్పంచులుగా, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ లుకా అనేక పదవులు ఇచ్చి గౌరవించుకున్నట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా ముదిరాజ్ ఆత్మగౌరవ భవనాన్ని సిద్దిపేటలో నిర్మించుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో ముదిరాజ్ ఆత్మ గౌరవ భవనాలు ఉన్న నియోజకవర్గం సిద్దిపేట ఒకటే అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో మత్స్య కారులకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కొత్త సభ్యత్వ కార్డులను మంజూరు చేసినట్లు స్పష్టం చేశారు. కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ విగ్రహం ఏర్పాటు చేసిన చౌరస్తాను కృష్ణస్వామి జంక్షన్ గా ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ముదిరాజ్ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.