Additional Collector : గ్రూప్ 3 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-3 పరీక్ష కోసం జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అధికారులను ఆదేశించారు.

Update: 2024-11-04 14:02 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-3 పరీక్ష కోసం జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-3 పరీక్ష నిర్వహణకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫిసర్, రూట్ ఆఫిసర్లు, ఫ్లయింగ్ స్వ్కాడ్, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో 37 సెంటర్లలో 13,408 మంది అభ్యర్థులు గ్రూప్ 3 పరీక్ష వ్రాయనున్నట్లు తెలిపారు.

నవంబర్ 17న ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీ పేపర్-1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు హిస్టరీ- పాలిటి - సోసైటి పేపర్-2, నవంబర్ 18న ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు ఎకానమీ డెవలప్ మెంట్ పేపర్ -3 పరీక్షలు నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష సమయానికి అరగంట ముందే పరీక్ష కేంద్రం గేటు మూసి వేస్తారని తెలిపారు. పరీక్ష రాసే అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో చేతికి మెహందీ ఉండకూడదన్నారు. పరీక్ష కేంద్రాలలోకి ఎలక్ట్రానిక్ వస్తువులు, బంగారు, వెండి అనుమతి లేదన్నారు. సాధారణ చేతి గడియారం మాత్రమే అనుమతి ఉందన్నారు. కంటి చూపు లేని వారికి టీజీపీఎఎస్సీ మార్గదర్శకాలకు అనుగుణంగా స్క్రైబ్ ఇవ్వడం జరుగుతుంది అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.


Similar News