ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైంది : హరీష్ రావు
ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి
దిశ, సిద్దిపేట ప్రతినిధి : ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ.. చేతలు గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సీజన్ లో 91 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని గొప్పగా ప్రకటించిన.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. కొనుగోలు కేంద్రాలను సమయానికి ప్రారంభించక పోవడం.. ధాన్యం కొనుగోళ్లు జరపక పోవడంతో అన్నదాతలు దళారులకు వరి ధాన్యం అమ్ముకొని నష్ట పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో రైతులను కంటికి రెప్పలా కాపాడుకున్నట్లు గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అసమర్థత వల్ల రైతులు నష్ట పోతున్నారని అన్నారు. రాష్ట్రంలో రైతు ప్రభుత్వం కాదని రాబందుల ప్రభుత్వం అని మండిపడ్డారు.
యాసంగి, వానాకాలం సంబంధించి ఎకరానికి రూ.15వేల చొప్పున రైతు భరోస సాయం అన్నదాతల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కిట్టు, బతుకమ్మ చీరలు, రెండు నెలల పింఛన్లు, రైతు బంధు ఎగ్గొట్టిన పుణ్యాత్ముడు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హామీల అమలు కోసం బీఆర్ఎప్ పార్టీ పక్షాన ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. వ్యవసాయానికి 15 గంటల కరెంట్ సైతం ఇవ్వడం లేదన్నారు. రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మా రెడ్డి రవీందర్ రెడ్డి, వేలేటి రాధ కృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి కి అడ్వాన్స్ జన్మదిన శుభాకాంక్షలు
సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అడ్వాన్స్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పుట్టిన రోజు పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామి దర్శనం కు వెళ్లుతున్నట్లు తెలిసింది అన్నారు. ఆగస్టు 15న నాటికి రైతుల రుణ మాఫీ చేస్తా అని లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు వేసి మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమించు తప్పయింది వేడుకోవాలని సూచించారు.