ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అందజేస్తున్న నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు.
దిశ పటాన్ చెరు: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అందజేస్తున్న నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. బుధవారం పటాన్ చెరు ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సీడీఎఫ్ నుంచి మంజూరైన నిధులను సద్వినియోగం చేసుకోవడంలో పంచాయతీలు వెనుకబడి ఉండడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
సంబంధిత గ్రామల సర్పంచ్ లు, పాలకమండలి సభ్యులు, అధికారులు సత్వరమే నిధుల వినియోగానికి ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల వినియోగంలో నియోజకవర్గం అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. ఖాళీ స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే నిరుపేదలకు ప్రభుత్వం త్వరలోనే రూ.3లక్షలు అందజేయనుందని ఆయన తెలిపారు. దళితుల ఆర్థిక అభ్యున్నతికి కోసం ప్రవేశ పెట్టిన దళితబంధును సైతం నియోజకవర్గ వ్యాప్తంగా అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఇస్నాపూర్, రుద్రారం ముత్తంగి, చిట్కుల్ తదితర ప్రాంతాల్లో గంజాయి క్రయ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయని స్థానిక ప్రజాప్రతినిధులు సభ దృష్టికి తీసుకుని రాగా, గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. క్రిమినల్ కేసులు నమోదు చేసి, పూర్తిస్థాయిలో కట్టడి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ సుప్రజా వెంకట్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, తహసీల్దార్ పరమేశం, ఎంపీడీవో భన్సీలాల్, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.