గాయత్రీ లీలలు.. కోట్లలో దండుకుంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు

రోజు రోజుకూ రియల్​ ఎస్టేట్​ వ్యాపారం కొత్తపుంతలు తొక్కుతున్నది..

Update: 2023-02-25 03:11 GMT

దిశ, సంగారెడ్డి: రోజు రోజుకూ రియల్​ ఎస్టేట్​ వ్యాపారం కొత్తపుంతలు తొక్కుతున్నది. భూమి ఉన్నది కొంత అయితే పెద్ద మొత్తంలో వెంచర్ చేస్తున్నామంటూ వ్యాపార సంస్థలు ప్రచారం చేసుకుంటున్నాయి. ప్రీ లాంచ్, బైబ్యాక్ ఆఫర్లను ప్రకటించి కస్టమర్లకు అరచేతిలో వైకుంఠం చూపిస్తాయి. సదాశివపేట మండలం చందాపూర్ గ్రామంలో గాయత్రీ ఇన్ ఫ్రా డెవలపర్స్ సంస్థ డీటీసీపీ, రేరా ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వెంచర్ ఏర్పాటుపై పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అమ్మకాలు కూడా ప్రారంభించారు. వెంచర్ ఏర్పాటు చేసేందుకు గ్రామ పరిధిలో రైతుల నుంచి 30 ఎకరాల లోపు భూమిని మాత్రమే కొనుగోలు చేశారు. కానీ, ఫ్లెక్సీలో మాత్రం డీటీసీపీ అనుమతి త్వరలో వస్తుందంటూ 200 ఎకరాల్లో అప్ కమింగ్ డీటీసీపీ వెంచర్ .. హై క్లాస్ సౌకర్యాలు అంటూ ప్రచారం నిర్వహిస్తున్నది. కనీసం భూమిని చదును చేయకుండా రాళ్లు, పొదలతో నిండిన భూమిలో వెంచర్ అంటూ అమాయక ప్రజలను మోసం చేస్తూ ఆకర్షణీయ ఆఫర్ల పేరిట బురిడీ కొట్టిస్తూ ప్లాట్లను విక్రయిస్తున్నారు. రోడ్లపై పెద్ద ఎత్తున వెంచర్ పేరుతో ప్లెక్సీలు ఏర్పాటు చేసినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు.

సదాశివపేట మండలం చందాపూర్​ గ్రామంలో గాయత్రీ సంస్థ బైబ్యాక్ ఆపర్ల పేరిట కస్టమర్లను ఎరవేస్తూ ఆశలు పుట్టిస్తున్నది. మధ్య తరగతి ప్రజల సొంతింటి ఆశలను సొమ్ము చేసుకుంటూ అక్రమంగా కోట్లలో వ్యాపారం చేస్తున్నారు. ముఖ్యంగా ప్లాట్లు కొనడమే కాదు పెట్టుబడి పెడితే రెండింతలు ఇస్తామని ప్రకటిస్తున్నారు. అందమైన బ్రోచర్లు ముద్రించి డీటీసీపీ అప్రూవల్ పొందకుండా, రేరా అనుమతి తీసుకోకుండా ఎల్ పీ నంబర్ లేకుండానే మార్కెటింగ్ చేస్తున్నారు. ఎకరం భూమి కోటి రూపాయలు ఉంటుందని, పెట్టుబడి కోటి పెడితే రూ. కోటి 50 లక్షలతో పాటు 1600 గజాల స్థలం ఇస్తామని ప్రకటించారు. అర ఎకరానికి రూ. 50 లక్షలు పెట్టుబడి పెడితే రూ.75 లక్షలు ఇవ్వడంతో పాటు 800 గజాల స్థలం, పావు ఎకరం రూ. 25 లక్షలు పెట్టుబడి పెడితే రూ. 35 లక్షలు ఇవ్వడంతో పాటు 400 గజాల స్థలం ఇస్తామని ప్రకటించారు. బై బ్యాక్ ఆఫర్ కింద ప్లాట్లు కొనుగోలు చేయడంతో పాటు పెట్టుబడి పెట్టినవారికి 15 నెలల్లోనే తిరిగి ఇస్తామని నిర్వహకులు హామీ ఇస్తున్నారు.

ఏజెంట్లకు దుబాయ్ ట్రిప్ ఆఫర్.. చందాపూర్ శివారులో గాయత్రీ ఇన్ ఫ్రా డెవలపర్స్ అక్రమంగా ప్లాట్లను విక్రయించేందుకు ఏజెంట్లను నియమించుకుంది. ఇందుకు హైదరాబాద్ లోని మాదాపూర్‌ను కేంద్రంగా చేసుకుని వ్యాపారం ప్రారంభించింది. ఐఐటీకి దగ్గరగా ఉండడంతో పాటు నేషనల్ హైవేకు సమీపంలో అంటూ అతి తక్కువ ధరలకు ప్లాట్లను విక్రయిస్తున్నామని ప్రచారం ఊదర గొడుతున్నది. ప్లాట్ల విక్రయాలకు నియమించుకున్న ఏజెంట్లకు సైతం ఆఫర్లు ప్రకటించింది. ఎక్కువగా ప్లాట్లను విక్రయించిన వారికి దుబాయ్ ట్రిప్‌తో పాటు బంగారం, ఎల్ఐసీ ఫాలసీ, ఇన్నోవాక్రిష్టా కారును బహుమతిగా అందిస్తామని ప్రకటించింది. ఇప్పటికే సుమారు 100 మందికి ప్లాట్లను విక్రయించినట్లు సమాచారం. వెంచర్ ఏర్పాటుకు ఫర్మీషన్ తీసుకోకుండానే ప్రచారం నిర్వహించి ప్లాట్ల పేరిట కోట్ల రూపాయలు దండుకుని ప్రజలను మోసం చేస్తున్నారు. డీటీసీపీ అనుమతి ఉందంటూనే, త్వరలో వస్తుందంటూ పెద్ద పెద్ద హోర్డింగులు ఏర్పాటు చేశారు. కనీసం భూమిని కూడా ఎలాంటి చదును చేయకుండానే విక్రయాలు ప్రారంభించి జనాలను గాయత్రీ ఇన్ఫ్రా డెవలపర్స్ మోసానికి పాల్పడుతున్నది. ఇప్పటికే వందల ప్లాట్లు విక్రయించి కోట్లలో వ్యాపారం చేస్తూ అమాయక కస్టమర్లను మోసం చేస్తున్నారు.

పట్టించుకోని అధికారులు.. ప్రజలను రంగురంగుల బ్రోచర్లు, ఫ్లెక్సీలతో మోసం చేస్తూ యథేచ్ఛగా ప్లాట్లు విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం విస్మయానికి గురిచేస్తున్నది. గ్రామ పంచాయతీకి సమాచారం లేకుండానే వెంచర్ ఏర్పాటు చేయడంతో పాటు డీటీసీపీ అనుమతులు, రేరా, ఎల్ పీ నంబర్ లేకుండానే విక్రయాలు ప్రారంభించిన జిల్లా పంచాయతీ అధికారులు కానీ, ఎంపీఓ, గ్రామ పంచాయతీ కార్యదర్శి చూసి చూడనట్లుగా వదిలేయడం పలు అనుమానాలకు తావిస్తున్నది. కొన్నది 30 ఎకరాల లోపు భూమి కానీ 200 ఎకరాల్లో వేంచర్ అంటూ ప్రచారం చేస్తూ కస్టమర్లను మోసం చేస్తున్నారు. అనుమతి లేకుండానే విక్రయాలు ప్రారంభించిన గ్రాయత్రీ ఇన్ఫ్రా డెవలపర్స్ పై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్  చేస్తున్నారు.

Tags:    

Similar News