Dubbaka MLA : కాంగ్రెస్ లో గాంధీలు పోయారు.. గాడ్సే లు వచ్చారు

ఒకప్పుడు కాంగ్రెస్ లో గాంధీలు ఉండేవారని, నేడు వారి స్థానంలో గాడ్సే లు వస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు.

Update: 2024-09-17 14:31 GMT

దిశ గజ్వెల్/ కొండపాక: ఒకప్పుడు కాంగ్రెస్ లో గాంధీలు ఉండేవారని, నేడు వారి స్థానంలో గాడ్సే లు వస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. గజ్వెల్ లో మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అధికారం శాశ్వతం కాదని, అహంకారంతో వ్యవహరిస్తే పాతాళంలోకి పోవడం ఖాయమని పేర్కొన్నారు. నాడు ఈరోజున నిజాం నవాబు పాలన నుండి వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో విమోచనం జరిగిందన్నారు. అలాంటి తెలంగాణలో సమైక్యాంధ్ర పాలనలో అగమైపోయిందని, కెసీఆర్ నాయకత్వంలో అమర వీరుల త్యాగలతో తెలంగాణ సాధించుకోవడం జరిగిందన్నారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తేనే నేడు సీఎం గా రేవంత్ రెడ్డి అయ్యాడన్నారు.

అభినవ సర్దార్ వల్లాభాయ్ పటేల్ లా కేసీఆర్ తెలంగాణ సాధిస్తే.. ఆయన మీద సీఎం రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా నాలుక పారేసుకోవడం మంచిది కాదన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాదు గాంధీ భవన్ లో మీ గాడ్సేలే జల్లెడ విత్తనాలు నాటుతున్నారని, త్వరలో మొక్కలవుతాయన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైన రేవంత్ రెడ్డి విద్వేష మాటలతో, చేష్టలతో ప్రజల దృష్టి మార్చే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం సరికాదన్నారు. తెలంగాణ చరిత్ర లో రాజీవ్ గాంధీ పాత్ర ఏముందని, నాడు తెలంగాణ బలి దేవత అన్న రేవంత్ రెడ్డి నేడు బలి దేవత భర్త విగ్రహాన్ని ఎలా పెడుతున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

ఉద్యమంలో తెలంగాణ తల్లి ని ఏర్పాటు చేసుకొని ముందుకు సాగమన్నారు. అలాంటి తల్లికి తెలంగాణలో ఉనికి లేకుండా చేస్తున్నాడన్నారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. హైడ్రా పేరు మీద సామాన్య, పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు. మాటలు పక్కన పెట్టి పాలనపై దృష్టి సారించాలని, రేవంత్ పాలనలో అన్ని వ్యవస్థలు అగమయ్యాయన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పైసా నిధుల్లేవు, పారిశుద్ధ్యం పడకేసిందన్నారు. దవాఖానల్లో సూది, మందులు దొరకడం లేదన్నారు. ప్రజల కిచ్చిన హామీల కోసం పోరాటం సాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వైస్ చైర్మన్ జకీయోద్దీన్, మాజీ జడ్పీటీసీ పంగ మల్లేశం, నాయకులు వంటేరు గోపాల్ రెడ్డి, నవాజ్ మీరా, బెండ మధు, దేవీ రవీందర్, ఆకుల దేవేందర్, రాజిరెడ్డి, కౌన్సిలర్లు నర్సింగరావు, రజిత, బాలమని, తదితరులు పాల్గొన్నారు.


Similar News