ఈ నెల 28న తుది ఓటర్ జాబితా.. కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి..

గ్రామ పంచాయతీలకు సంబంధించి ఈ నెల 28న ఓటర్ జాబితాను ప్రచురిస్తామని జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి స్పష్టం చేశారు.

Update: 2024-09-18 15:58 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : గ్రామ పంచాయతీలకు సంబంధించి ఈ నెల 28న ఓటర్ జాబితాను ప్రచురిస్తామని జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి స్పష్టం చేశారు. సిద్దిపేట కలెక్టరేట్ లో గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటర్ జాబితా తయారీ పై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 13న జిల్లాలోని 491 గ్రామ పంచాయతీలకు డ్రాఫ్ట్ ఓటర్ జాబితా ప్రచురించారన్నారు. ఓటర్ జాబితాలో తప్పులకు అవకాశం లేకుండా సమర్ధవంతంగా తయారు చేసేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈనెల 21 వ తేదీ నుంచి గ్రామ పంచాయతీ సెక్రటరీలు, ఎంపీడీవో కార్యాలయాల్లో సలహాలు, సూచనలు అందించాలని సూచించారు. మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి ఈ నెల 28న తుది ఓటర్ జాబితాను ప్రచురిస్తామన్నారు.

సిద్దిపేట రూరల్ మండలం నారాయణరావు పేట మండలంలోకి మారిన 15 గ్రామ పంచాయతీలు, 8 పునరావాస కాలనీల గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నుంచి సవరణ రాగానే డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ జారీ చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు ఒక కుటుంబానికి చెందిన ఓటర్లను ఒకే పోలింగ్ బూత్ పరిధిలో ఉండేలా చూడాలని, ఒక పోలింగ్ బూత్ లో 500 మంది ఓటర్లకు మించకుండా ఓటర్లు ఉండేలా చూడాలని, కుల గణన నిర్వహించి రిజర్వేషన్‌లను గుర్తించిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరీమ అగర్వాల్, జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి, జడ్పీసీఈవో రమేష్, డివిజనల్ పంచాయతీ అధికారి మల్లికార్జున్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.


Similar News