‘ఫ్లెక్సీలను కూడా ఓర్వడం లేదు.. బీసీను ఎదగనివ్వరా?’

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో భాగమైన పటాన్ చెరులో కొన్ని వర్గాల వారు బీసీలను అనగదొక్కుతున్నారు. బీసీ నాయకులు వేసుకుంటున్న ఫ్లెక్సీలను కూడా చూసి ఓర్వడం లేదు.

Update: 2023-05-11 03:16 GMT

దిశ బ్యూరో, సంగారెడ్డి : శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో భాగమైన పటాన్ చెరులో కొన్ని వర్గాల వారు బీసీలను అనగదొక్కుతున్నారు. బీసీ నాయకులు వేసుకుంటున్న ఫ్లెక్సీలను కూడా చూసి ఓర్వడం లేదు. రాత్రికి రాత్రే చింపివేయిస్తున్నారు. ఇంత అరాచకం, ఇష్టారాజ్యం ఎక్కడా లేదు. ఓ దైవ కార్యం కోసం కార్పోరేటర్ ను అయిన తాను వేయించిన ఫ్లెక్సీలనే చింపేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆశ్రయించారు. ఈ చర్యలపై పటాన్ చెరు కార్పోరేటర్ మెట్టుకుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భవంగా ఆయన దిశ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు.

దైవకార్యం కోసం వేసిన ఫ్లెక్సీలు చించారు

పటాన్ చెరు పట్టణం బీసీ కాలనీలోని రుక్మిణి సత్యబామ సహిత వేణుగోపాల స్వామి వారి దివ్వ ప్రతిష్టస్థాపన మహోత్సవాలు ఈ నెల 9 నుంచి 13 వరకు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే సందర్భంగా స్థానిక కార్పోరేటర్ మెట్టుకుమార్ పబ్లిక్ కు సమాచారం కోసం పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. ఆయన ఆద్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో భక్తి శ్రద్ధలతో ఉత్సవంగా నిర్వహించడానికి ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని మెట్టుకుమార్ యాదవ్ చెబుతున్నారు. ఇదిలా ఉండగా కార్పోరేటర్ వేయించిన ఫ్లెక్సీలను రాత్రికి రాత్రే గుర్తు తెలియని వ్యక్తులు కత్తిరించడంతో పాటు చింపివేశారు. విషయం తెలిసి మెట్టుకుమార్ యాదవ్ తీవ్ర ఆందోళన చెందారు. ఆలయాల నిర్మాణం ప్రజల మేలుకోరి చేశామని, ఇలాంటి దైవ్య కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎవరు చింపేశారని మండిపడ్డారు. ఇది అత్యంత హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా బుదవారం పటాన్ చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫ్లెక్సీలను చింపేసిన వారిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని మెట్టుకుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.

దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలి..

దమ్ముంటే తనను రాజకీయంగా ఎదుర్కోవాలని కానీ ఇలాంటి దైవ్య కార్యక్రమాలపై తమ ప్రతాపం చేపించవద్దని మెట్టుకుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పటాన్ చెరులో బీసీలను ఎదగనివ్వరా..? పటాన్ చెరు కొన్ని వర్గాలకే రాసిచ్చారా..? ఇంత ఇష్ట్యారాజ్యం ఎక్కడ లేదని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ముప్పైఏళ్లుగా రాజకీయాలు చేస్తున్నామని, పండుగలు, ఇతర కార్యక్రమాలకు ఫ్లెక్సీలు వేస్తున్నామని, ఎప్పుడు కూడా ఇలా చించివేత లాంటి నీచ రాజకీయాలు చూడలేదన్నారు. సీనియర్ రాజకీయ నాయకుడిగా, అధికార పార్టీ కార్పోరేటర్ గా బాధపడుతున్నానన్నారు. రాజకీయ కక్ష్యలు ఉంటే రాజకీయంగానే ఎదుర్కోవాలని, ఇలాంటి చేతకాని చర్యలకు పాల్పడితే ఇకమీదట ఊరుకునే ప్రసక్తేలేదని మెట్టుకుమార్ యాదవ్ హెచ్చరించారు.

 గతంలోనూ ఇతర పార్టీల ఫ్లెక్సీలు..

పటాన్ చెరు పట్టణంలో ఫ్లెక్సీల చించివేతపై గతంలోనూ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాట శ్రీనివాస్ గౌడ్, బీజేపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ లు కూడా తాము వేసిన ఫ్లెక్సీలు చించివేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ లెక్కన పటాన్ చెరు ఏరియాలో ఒక వర్గం మినహా ఇతర ఎవరు ఫ్లెక్సీలు వేసిన చింపివేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ నాయకుడు చెప్పుకువచ్చాడు.

పోలీసుల ప్రేక్షక పాత్ర..మళ్లీ మళ్లీ ఫ్లెక్సీల గొడవలు..

గత కొంత కాలంగా పటాన్ చెరుపట్టణంలో ఫ్లెక్సీల చించివేత ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ నాయకులతో పాటు అధికార టీఆర్ఎస్ చెందిన సర్పంచ్, ఇప్పుడు పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టుకుమార్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చానీయాంశం అయ్యింది. కొందరి ఫ్లెక్సీల జోలికి మాత్రం ఎవరు వెళ్లకపోవడం, పై వారందరి ఫ్లెక్సీలు మాత్రమే చింపడం చర్చకు దారితీస్తున్నది. ఫ్లెక్సీల చింపివేతపై ఫిర్యాదులు అందినప్పటికీ పోలీసులు ఎవరిపై కేసులు నమోదు చేయకపోవడంతోనే సదరు గుర్తు తెలియని వ్యక్తులుగా చెప్పుకునే వారు అదే పనిగా ఫ్లెక్సీలు తొలగిస్తున్నారననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్లెక్సీల వ్యవహారాన్ని పటాన్ చెరు పోలీసులు సీరియస్ గా తీసుకోకపోవడంతో ఈ ఘటనలు పునరావృతం అవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సీసీ కెమారాలు అన్ని చోట్ల ఉన్నాయని, చించివేసిన వారిని ఎందుకు గుర్తించడం లేదని పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్నది.

Tags:    

Similar News