ధాన్యం కొనుగోలులో బస్తాకు ఐదు కిలోల తరుగు.. భగ్గుమన్న రైతన్నలు..

అధికారులు రైస్ మిల్లర్ యాజమాన్యం కుమ్మక్కై రైతుల వరి ధాన్యం కొనుగోలులో బస్తాకు ఐదు కిలోల చొప్పున తరుగు పేరిట నిలువు దోపిడి చేస్తున్నారని రాంపూర్ 161 అకోలా - నాందేడ్ జాతీయ రహదారి పై రైతన్నలు ట్రాక్టర్ అడ్డుపెట్టి బైఠాయించి, రాస్తారోకో నిర్వహించారు.

Update: 2024-11-22 10:49 GMT

దిశ, అల్లాదుర్గం : అధికారులు రైస్ మిల్లర్ యాజమాన్యం కుమ్మక్కై రైతుల వరి ధాన్యం కొనుగోలులో బస్తాకు ఐదు కిలోల చొప్పున తరుగు పేరిట నిలువు దోపిడి చేస్తున్నారని రాంపూర్ 161 అకోలా - నాందేడ్ జాతీయ రహదారి పై రైతన్నలు ట్రాక్టర్ అడ్డుపెట్టి బైఠాయించి, రాస్తారోకో నిర్వహించారు. సంబంధిత అధికారులు, మిల్లర్ లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అల్లాదుర్గం మండలంలోని రాంపూర్ గ్రామ శివారులో గల రైస్ మిల్లర్ యాజమాన్యం, ఐకేపీ అధికారులు రైతుల నుండి కొనుగోలు చేసిన వరి ధాన్యం కొనుగోలులో బస్తాకు 4 నుండి 5 కిలోల చొప్పున తరుగు విధించడంతో రైతన్నలు ఒక్కసారిగా మండిపడ్డారు.

ప్రభుత్వం దళారులను నమ్మొద్దని నేరుగా రైతులకు న్యాయం చేకూర్చాలనే ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీని రైస్ మిల్లర్ యాజమాన్యం , అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రైతుల నుండి అదనంగా వడ్లను దోపిడీ చేస్తున్నారని వారు మండిపడ్డారు. తమకు అన్యాయం జరుగుతుందని తమకు న్యాయం చేసేంతవరకు ఇక్కడి నుండి కదిలేది లేదంటూ మొండికేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు జోక్యం చేసుకొని అధికారులతో మాట్లాడి తమకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు.


Similar News