రైతులకు ఎకరాకు రూ. 50 వేలు ఇవ్వాలి.. అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం

Update: 2023-03-23 12:10 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి: అకాల వర్షం, వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50 వేలు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మైపాల్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ అదనపు కలెక్టర్ కు బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసలు బీమా యోజన పథకాన్ని తెలంగాణలో అమలు చేయకపోవడం వల్ల ఇటువంటి విపత్కర పరిస్థితుల నుండి రైతాంగాన్ని ఆదుకునే అవకాశాన్ని చేజేతుల కోల్పోతున్నామని ఆవేదన చెందారు. అకాల వర్షాలు, వడగళ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటలు నష్ట పోయిన రైతుల సమగ్ర నివేదిక తయారు చేయాలని సూచించారు.

జిల్లాలోని రైతు సంఘాలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పంట తీవ్రతను అంచనా వేయాలని డిమాండ్ చేశారు. నష్టపరిహారం అందించడంలో ప్రభుత్వం ఉదాసీనత ప్రదర్శిస్తే బీజేపీ ఆధ్వర్యంలో అందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. తెలంగాణలో ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి కురిక్యాల రాములు, గుండ్ల జనార్దన్, మెరుగు భూమేష్ గౌడ్, కిసాన్ మోర్చా నాయకులు గడ్డమీది రామస్వామి, పరకాల తిరుపతిరెడ్డి, మన్నే శీను, పాలకొల్లు వెంకటరెడ్డి, చల్లారం రమేష్ రెడ్డి, గౌరారం కృష్ణ ,సురేష్, దిండి నాగరాజు, పంగ నరసింహారెడ్డి, బండిపెల్లి సత్యనారాయణ, నేతి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : స్ఫూర్తి ప్రధాత భగత్ సింగ్..

Tags:    

Similar News