Family Planning: కుటుంబ నియంత్రణ బంద్..! మా వల్ల కాదంటూ చేతులెత్తేసిన వైద్యులు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు అన్ని వైద్యసేవలు అందుబాటులో ఉండాలని పాలకులు పదే పదే చెబుతున్నా ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు.
దిశ, మెదక్ ప్రతినిధి : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు అన్ని వైద్యసేవలు అందుబాటులో ఉండాలని పాలకులు పదే పదే చెబుతున్నా ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. కుటుంబ నియంత్రణ కోసం గతంలో పాలకులు ‘ఒకరు చాలు.. ఇద్దరు ముద్దు’ అనే నినాదంతో ఎన్నో సదస్సు నిర్వహించి అవగాహన కల్పించి మరి క్యాంప్ లు నిర్వహించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. కానీ రెండేళ్లుగా మెదక్ లో ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పూర్తిగా నిలిపి వేయడంతో మహిళలు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి జేబులు ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి జిల్లా కేంద్రంలో నెలకొంది.
మెదక్ జిల్లాలో మాతా శిశు ఆరోగ్య కేంద్రంతో పాటు నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట ఏరియా ఆసుపత్రులు, 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. రామాయంపేటలో కేవలం నార్మల్ డెలివరీలు మాత్రమే జరగగా ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్జరీ ప్రసూతి కాన్పులు చేపడుతున్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో గత ప్రభుత్వం హయంలో ఆధునాతన సౌకర్యాలతో మాతా శిశు ఆరోగ్య కేంద్రం ఏర్పాటైంది. దీంతో ప్రసవాలు సైతం భారీ స్థాయిలో చేస్తూ రాష్ట్రంలోనే అత్యధిక ప్రసవాలు చేసిన రికార్డు కూడా తీసుకువచ్చారు.
రామాయంపేటలో కేవలం నార్మల్ డెలివరీలు మాత్రమే చేయగా మెదక్, నర్సాపూర్, తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్జరీ ప్రసవాలు సైతం చేస్తున్నారు. దాదాపు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య దాదాపుగా తగ్గిపోయింది. దీంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇందుకు ప్రభుత్వ కృషిపై ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. కానీ రెండేళ్ల క్రితం రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి మహిళా మృతి నేపథ్యంలో రాష్ట్ర కుటుంబ నియంత్రణ నిలిపి వేశారు. అందులోని ప్రసవాలు సంఖ్య పెరగడం మూలంగా కుటుంబ నియంత్రణ పని భారంగా వైద్యులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో చాలా వరకు ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పూర్తిగా నిలిపి వేసినట్టు వైద్యులే చెబుతున్నారు.
కుటుంబ నియంత్రణకు ఇక్కడకు వెళ్లాలి
గర్భిణులకు ప్రసవాలు చేసేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెంచిన సర్కారు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిలిపి వేసిందా అనే సందేహాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. మెదక్ పట్టణానికి చెందిన మౌనికకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకునేందుకు మెదక్ మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వైద్యులను సంప్రదించగా ఇక్కడ కుటుంబ నియంత్రణ చేయడం లేదన్న సమాధానం వచ్చింది. ఫతేనగర్ కు చెందిన చెగల్ పర్తి లక్ష్మి నెల కిందట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లు చేయడం లేదని చెప్పడంతో రూ.20 వేలు ఖర్చు చేసి ప్రైవేట్ లో సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. అలాగే దాయరకు చెందిన వడ్ల కవిత సైతం ప్రైవేట్ లోనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది.
ఇలా మెదక్ ప్రాంతానికి చెందిన వందలాది మంది మహిళలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ సౌకర్యం లేక ప్రైవేట్ వైపు వెళ్ళి డబ్బులు ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆసుపత్రుల్లో నియంత్రణ ఆపరేషన్ లు చేయకుంటే ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రశ్న అందరిలో నెలకొంది. మెదక్ లో మాత్రం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లు చేయకపోవడంతో ఆర్థికంగా లేని పేద మహిళలు నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి సర్జరీ చేయించుకుంటున్నారు. కానీ ఇంత పెద్ద ఎత్తున సౌకర్యాలు కల్పిస్తున్న మెదక్ లో ఎందుకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లు నిలిపి వేశారో మాత్రం తెలియని పరిస్థితి. ప్రైవేట్ ఆసుపత్రులకు మేలు చేసే ఉద్దేశ్యంతో చేశారా లేక మారే ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది.
ప్రైవేట్ ఆసుపత్రుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు బిల్లు వసూల్ చేయడం మూలంగా చాలా మంది మహిళలకు ఆర్థిక భారంగా మారింది. ఒక వేళ నర్సాపూర్ వెళ్లి సర్జరీ చేయించుకోవాలని భావించిన అక్కడ మూడు రోజుల పాటు ఉండి రావడం పేద ప్రజలకు ఇబ్బందిగా మారింది. జిల్లా కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లు కొనసాగించేలా జిల్లా అధికారులు చొరవ తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. సీనియర్ డాక్టర్ శివదయాల్ మాట్లాడుతూ వైద్యాశాఖలో బదిలీల ప్రక్రియ సాగుతుందని, చాలా మంది బదిలీ అయ్యారని, సిబ్బంది పూర్తి స్థాయిలో వచ్చిన తరవాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లు చేస్తామని చెప్పారు.
రెండేళ్లుగా శిబిరాలు బంద్..
గతంలో కుటుంబ నియంత్రణ కోసం జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ల శిబిరాలు నిర్వహించేవారు. కానీ రాష్ట్రంలో ఒక చోట జరిగిన ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లాలో సైతం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ శిబిరాలు నిర్వహించడం లేదు. దీని వల్ల మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జిల్లా అంతటా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ శిబిరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.