దిశ, సిద్దిపేట ప్రతినిధి : సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం సమాన అవకాశాలు దక్కాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని జిల్లాలో 2కోట్ల 23లక్షల మంది మహిళలు సద్వినియోగ పరుచుకోవడంతో రూ.82 కోట్ల లబ్ది చేకూరిందన్నారు. పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్య శ్రీ వైద్య పరిమితిని రూ.10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. నిరుపేదలకు సొంత ఇంటి కల నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేసి ఈ సంవత్సరం 4లక్షల 50 వేల గృహాలను నిర్మించ తలపెట్టినట్లు స్పష్టం చేశారు. అందులో భాగంగా ప్రతి నియోజక వర్గంలో 3500 గృహాలు నిర్మించడం జరుగుతుందన్నారు. హుస్నాబాద్, స్టేషన్ ఘనాపూర్ నియోజక వర్గాల్లో 1లక్ష 6వేల ఎకరాల ఆయకట్టును గౌరవెల్లి ప్రాజెక్టు నీటితో స్థిరీకరించేందుకు ఎస్ ఆర్ ఎస్ పీ ఐఎఫ్ ఎఫ్ సీ ప్యాకేజ్ 7 మిగిలిన పనులు పూర్తి చేసేందుకు రూ.431 కోట్ల 30 లక్షల ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో జిల్లాలోని 840 ప్రభుత్వ పాఠశాలల్లో రూ.42 కోట్లతో అత్యవసర పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. సిద్దిపేట స్టీల్ బ్యాంకు సేవలను ఎకానామిక్ సర్వే ఆఫ్ ఇండియా పుస్తకంలో ప్రస్తావించడం జిల్లాకు గర్వ కారణం అన్నారు. స్వాతంత్ర్య సమర యోధులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శకటాల ప్రదర్శన, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, అడిషన్ కలెక్టర్ గరిమా అగ్రవాల్, పోలీస్ కమిషనర్ అనురాధ, మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.